YouVersion Logo
Search Icon

యెహెజ్కేలు 19

19
ఇశ్రాయేలును గూర్చి విషాద గీతం
1దేవుడు నాకు ఈ విధంగా చెప్పాడు: “ఇశ్రాయేలు నాయకులను గురించి నీవు ఈ విషాద గీతం ఆలపించాలి:
2“‘నీ తల్లి ఆడసింహంలా,
మగసింహాల మధ్య పడుకొని ఉంది.
ఆమె యౌవ్వనంలో ఉన్న మగ సింహాలతో పడుకొని ఉంది.
దానికి చాలా మంది పిల్లలున్నారు.
3ఆ సింహపు పిల్లల్లో ఒకటి లేచింది.
అది బలమైన యువసింహంలా తయారయ్యింది.
అది తన ఆహారాన్ని వేటాడటం నేర్చుకుంది.
అది ఒక మనుష్యుని తినేసింది.
4“‘అది గర్జించటం ప్రజలు విన్నారు.
తాము పన్నిన బోనులో దానిని పట్టుకున్నారు!
దాని నోటికి గాలం తగిలించారు.
వారా కొదమ సింహాన్ని ఈజిప్టుకు తీసుకొని వెళ్లారు.
5“‘తల్లి తన యువసింహం నాయకత్వం వహిస్తుందనుకుంది.
కాని ఆమె ఆశలు అడియాశలయ్యాయి.
అందువల్ల ఆమె తన పిల్లల్లో మరో దానిని తీసుకుంది.
దానిని యువ సింహంలా తీర్చిదిద్దింది.
6అది పెద్ద సింహాలతో కలిసి వేటకెళ్లింది.
అది భయంకర సింహంలా తయారయ్యింది.
అది తన ఆహారం వేటాడ నేర్చుకుంది.
అది ఒక మనుష్యుని చంపి తినివేసింది.
7ఆది రాజభవనాల మీద దాడి చేసింది. అది నగరాలను నాశనం చేసింది.
దాని గర్జన విన్న ప్రతివాడూ నోట మాట లేక నివ్వెరపోయాడు.
8అప్పుడు తనచుట్టూ నివసిస్తున్నవారు దానికై వలపన్నారు.
అది వారి వలలో చిక్కిపోయింది.
9వారు దానికి కొక్కీలు వేసి బంధించారు.
వారు దానిని తమ బోనులో ఇరికించారు.
వారు దానిని బబులోను రాజు వద్దకు తీసుకొని పోయారు.
అందువల్ల ఇశ్రాయేలు పర్వతాలలో
ఇప్పుడు మీరు గర్జన వినలేరు.
10“‘మీ తల్లి నీటి ప్రక్క
నాటిన ద్రాక్షాలతలాంటిది.
దానికి నీరు పుష్కలంగా ఉంది.
అది చాలా ఫలభరితమైన దళమైన ద్రాక్షా తీగలతో పెరిగింది.
11ఆ పిమ్మట దానికి కొన్ని పెద్ద కొమ్మలు పెరిగాయి.
అవి కొన్ని చేతికర్రల్లా ఉన్నాయి.
ఆ కొమ్మలు రాజదండాల్లా ఉన్నాయి.
ఆ ద్రాక్షాలత అలా, అలా పొడుగ్గా,
చాలా కొమ్మలతో మేఘాలను అంటేలా పెరిగింది.
12కాని ఆ ద్రాక్షా చెట్టు వేర్లతో పెరికివేయబడి,
నేలమీద కూల్చి వేయబడింది.
తూర్పుదిక్కు వేడిగాడ్పులు వీయగా దాని పండ్లు ఎండి పోయాయి.
దాని పెద్ద కొమ్మలు విరిగి పోయాయి. అవి అగ్నిలో వేయబడ్డాయి.
13“‘ఇప్పుడా ద్రాక్ష మొక్క ఎడారిలో నాటబడింది.
అది నీరులేక, దాహం పుట్టించే ప్రాంతం.
14దాని పెద్ద కొమ్మ నుండి నిప్పు చెలరేగింది.
నిప్పు దాని రెమ్మలను, పండ్లను నాశనం చేసింది.
అందుచే బలమైన చేతికర్రగా లేదు;
రాజదండముగా లేదు’
ఇది ఒక విషాద గీతం. అది వినాశనాన్ని గూర్చి పాడబడింది.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in