YouVersion Logo
Search Icon

ఎస్తేరు 5

5
మహారాజుతో ఎస్తేరు మాటలాడుట
1మూడవ రోజున ఎస్తేరు ప్రత్యేకమైన దుస్తులు ధరించి, రాజ నగరులోని, రాజభవనమెదుటవున్న లోపలి భవనములో నిలిచింది. మహారాజు అక్కడ సింహాసనం మీద కూర్చుని వున్నాడు. అతను న్యాయస్థానంలోకి జనం ప్రవేశించే దిశగా చూపు తిప్పి కూర్చున్నాడు. 2అప్పుడు అతని దృష్టి లోపలి ఆవరణలో నిలిచివున్న ఎస్తేరుపై పడింది. ఆమెను అక్కడ చూచినంతనే మహారాజు మనస్సు సంతోష భరితమైంది. ఆయన తన చేతిలోని బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు రాజు దర్బారు మందిరంలోకి పోయి బంగారు దండపు కొనని తాకింది.
3అప్పుడు మహారాజు ఎస్తేరుతో ఇలా అన్నాడు: “మహారాణి, ఏమిటి నీ దిగులు? నువ్వు నన్ను కోరాలనుకున్నదేమిటో కోరుకో, నువ్వేమి కోరుకున్నా, అర్ధ రాజ్యమైనా ఇచ్చేస్తాను.”
4ఎస్తేరు, “నేను తమకీ, హామానుకీ ఒక విందు ఏర్పాటు చేశాను. దయచేసి మీరూ, హామానూ యీ రోజు నా విందుకి రావాలని నా కోరిక” అని అడిగింది.
5అప్పుడు మహారాజు సేవకులకు, “మహారాణి ఎస్తేరు కోర్కెను మేము తీర్చాలి. వెంటనే పోయి, హామానును తొందరగా తీసుకురండి” అని ఆజ్ఞాపించాడు.
ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకి మహారాజూ, హామానూ వెళ్లారు. 6వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూండగా, మహారాజు ఎస్తేరును మళ్లీ ఇలా అడిగాడు: “ఎస్తేరూ, నువ్వేదైనా కోరుకో. అర్ధ రాజ్యమైనా సరే కోరుకో, నేను నీకిస్తాను.”
7అందుకు ఎస్తేరిలా సమాధానమిచ్చింది, “నేను మిమ్మల్ని కోరదలుచుకున్నది యిదీ మహారాజా! 8తమరికి నా మనవి అంగీకారమై, నేను కోరినది ఇవ్వాల నుకుంటే, రేపు నేనివ్వబోయే మరో విందుకి మీరూ, హామానూ తప్పక వేంచేయాలి. నా అసలు మనవి ఏమిటో నేను అప్పుడు విన్నవించుకుంటాను.”
మొర్దెకై పట్ల హామాను కోపం
9హామాను ఆ రోజున రాజభవనం నుంచి ఇంటికి మంచి హుషారుగా, మహానందంగా వెళ్లాడు. కాని, రాజ భవన ద్వారం దగ్గర మరల కనబడిన మొర్దెకై తనని చూసి కూడా లేచి, భయభక్తులతో తనకి నమస్కరించక పోయేసరికి హామానుకు తల కొట్టేసినట్లయింది. అతని కోపం మిన్నుముట్టింది. 10అయినా, హామాను తన కోపాన్ని అదుపు చేసుకొని, ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ తన మిత్రులనూ, తన భార్య జెరెషునూ పిలిచి కూర్చోబెట్టి, 11తన ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పడం మొదలెట్టాడు. తనకి చాలా మంది కొడుకులున్నారనీ, మహారాజు తనని ఎన్నో విధాల గౌరవించాడనీ, మిగిలిన నాయకులందరికంటె మహారాజు తనకి ఉన్నత స్థానమిచ్చాడనీ, చెప్పుకున్నాడు. 12హామాను యింకా ఇలా అన్నాడు, “అంతే ననుకున్నారేమో, కాదు.” “ఎస్తేరు మహారాణి తను యిచ్చిన విందుకి మహారాజుతోబాటు నన్నొక్కడినే ఆహ్వానించింది. రేపు తను యివ్వబోయే మరో విందుకి కూడా మహారాజుతోబాటు నన్ను కూడా మహారాణి ఆహ్వానించింది. 13అయినా నాకివన్నీ ఏమంత పెద్దగా ఆనందం కలిగించే విషయాలు కావు. ఆ యూదుడైన మొర్దెకై రాజభవన ద్వారం దగ్గర కూర్చొని ఉండటం ఎప్పటి వరకు నేను చూస్తూ ఉంటానో, అప్పటివరకు నేను నిజంగా సంతోషించలేను.”
14అప్పుడు హామాను భార్య జెరెషూ, అతని మిత్రులందరూ ఇలా సలహా యిచ్చారు: “మొర్దెకైని ఉరితీసేందుకుగాను ఒక స్తంభం పాతమని ఎవరినైనా పురమాయించు! ఆ ఉరికొయ్య 75 అడుగుల పొడుగు వుండాలి! ఇంకేముంది, రేపు ఉదయం మహారాజుతో ఆ ఉరికొయ్య మీద ఆ యూదుని ఉరితీయించమని చెప్పు. మహారాజుతో కలిసి విందుకి వెళ్లు. అప్పుడిక చూసుకో, నీ ఆనందానికి మేరవుండదు.”
హామానుకి ఆ సలహా నచ్చింది. వెంటనే అతను ఉరి కంబం సిద్ధం చేయమని ఒకణ్ణి ఆజ్ఞాపించాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in