YouVersion Logo
Search Icon

ఎస్తేరు 4

4
సహాయం చేయమని ఎస్తేరుకు మొర్దెకై నచ్చచెప్పటం
1మొర్దకై జరిగిన సంగతంతా తెలుసుకున్నాడు. యూదులకు వ్యతిరేకంగా మహారాజు ఆజ్ఞలను గురించి విన్న మొర్దెకై తన బట్టలు చింపుకొని, తన నెత్తిమీద బూడిద పోసుకొని, విషాద సూచకమైన దుస్తులు ధరించి, నగరంలోకి పోయిగట్టిగా ఏడ్వ నారంభించాడు. 2కాని, మొర్దెకై రాజభవన ద్వారం వరకు మాత్రమే పోగలిగాడు. అయితే, విషాద సూచక దుస్తులు ధరించినవారెవరూ ఆ ద్వారంలో ప్రవేశించేందుకు అనుమతింపబడరు. 3రాజాజ్ఞ చేరిన ప్రతి సామంత రాజ్యంలోనూ యూదుల్లో విచారం అలుముకొంది. ఏడ్పులు చెలరేగాయి. వాళ్లు శోకాలు పెడుతూ, ఉపవాసాలుండసాగారు. చాలామంది యూదులు నెత్తిన బూడిద పోసుకొని, సంతాప సూచక దుస్తులు వేసుకొని నేలమీద పడి వున్నారు.
4-5ఎస్తేరు పరిచారికలు, నపుంసకులు ఆమె దగ్గరికి వెళ్లి, ఆమెకి మొర్దెకై గురించి చెప్పారు. దానితో, ఎస్తేరు మహారాణి గాభరా చెందింది, బాగా విచారగ్రస్తి అయింది. విషాద సూచకమైన దుస్తులు వదలి, వాటి స్థానంలో వేసుకొనేందుకు మంచి దుస్తులు ఆమె మొర్దెకైకి పంపింది. కాని, అతను ఆ దుస్తులు ధరించేందుకు నిరాకరించాడు. హతాకు అనే నపుంసకుడు ఎస్తేరు ప్రధాన సేవకుడు. ఎస్తేరు అతన్ని మొర్దెకై వద్దకు పోయి అతన్ని కలవరపరుస్తున్నదేమిటో, దానికి కారణం ఏమిటో కనుక్కోమని పంపింది. 6రాజభవన ద్వారం ముందర నగరంలోని, ఖాళీ స్థలంలో వున్న మొర్దెకైని హతాకు పోయి కలిశాడు. 7అప్పుడు మొర్దెకై తన విషయంలో జరిగినదంతా హతాకుకి వివరించి చెప్పాడు. యూదులను హతమార్చేందుకు గాను రాజు గారి బొక్కసంలో సరిగ్గా ఎంత మొత్తం సొమ్ము జమ చేస్తానని హామాను వాగ్దానం చేశాడో చెప్పాడు. 8యూదులను చంపేయాలన్న మహారాజు ఆజ్ఞ ప్రతిని కూడా మొర్దెకై హతాకుకి ఇచ్చాడు. ఆ తాఖీదు షూషను నగరమంతటా ఎలా చాటబడిందో చెప్పాడు. ఆ ఆజ్ఞను ఎస్తేరుకి చూపించమనీ, విషయాలన్నీ వివరించి చెప్పమనీ, మహారాజు దగ్గరికి పోయి, మొర్దెకైకీ, తన స్వజనానికీ, క్షమాభిక్షను అర్థించేలా ఎస్తేరును ప్రోత్సహించమనీ అతను హతాకుకి చెప్పాడు.
9హతాకు రాణివాసానికి తిరిగి వెళ్లి, మొర్దెకై తనకి చెప్పిన విషయాలన్నీ ఎస్తేరుకి చెప్పాడు.
10అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ క్రింది మాటలు చెప్పమని హతాకును ఆజ్ఞాపించింది: 11“మహారాజు పిలువ నంపితేగాని స్త్రీగాని, పురుషుడుగాని మహారాజు సన్నిధికి వెళ్లడం నిషిద్ధం. అలా వెళ్లే వ్యక్తి మరణ శిక్షకి గురి అవుతాడు. మహారాజు సామంతులందరికీ, ఆయా సామంత దేశాల ప్రజలందరికీ యీ విషయం తెలుసు. ఆ వ్యక్తిని మహారాజు తన బంగారపు దండంతో అంటినప్పుడు మాత్రమే ఆ మరణ శిక్ష అమలు జరపబడదు. మహారాజు అలా చేస్తే, ఆ వ్యక్తి ప్రాణం నిలుస్తుంది. 30 రోజులుగా మహారాజు నన్ను పిలువనంపలేదు. మరి నేనెలా వెళ్లాలి?”
12-13అలా ఎస్తేరు పంపిన సందేశానికి బదులుగా మొర్దెకై ఆమెకి ఇలా సమాధనం పంపాడు: “ఎస్తేరూ, నువ్వు రాజభవనంలో వున్నావు, అంతమాత్రాన, యూదులందరిలో నీకొక్కదానికే రక్షణ వుంటుందని భ్రమపడకు. 14ఒకవేళ నువ్విప్పుడు మౌనం వహిస్తే యూదులకు స్వేచ్ఛా సహాయాలు మరొక చోటునుంచి వస్తాయి. కాని నువ్వూ, నీ తండ్రి కుటుంబ సభ్యులూ అందరూ మరణిస్తారు. బహుశా నువ్వీ మహాత్కార్యం కోసమే మహారాణిగా ఈ సమయంలో ఎంచుకోబడ్డావేమో ఆలోచించుకో.”
15-16అప్పుడు ఎస్తేరు మొర్దెకైకి ఈ క్రింది సమాధానం పంపింది: “మొర్దెకై! పోయి షూషను నగరంలోని యూదులందర్నీ కూడగట్టు, నా కోసం ఉపవాసం ఉండండి. నేను మూడు రాత్రులూ, పగళ్లూ అన్నపానాలు విసర్జిస్తాను. నేను నీలాగే ఉపవాసముంటాను. అలాగే, నా పరిచారికలు కూడా ఉపవాసం ఉంటారు. మా ఉపవాస దినాలు ముగిశాక, నేను మహారాజు సన్నిధికి వెళ్తాను, ఆయన నన్ను పిలువనంపక పోయినా సరే, వెళ్తాను. పిలుపు రాకుండా మహారాజు సమక్షానికి వెళ్లడం చట్టవిరుద్ధమని నాకు తెలుసు. అయినా సరే, నేను వెళ్తాను. నేను చనిపోతే చనిపోతాను.”
17మొర్దెకై అక్కడ్నుంచి వెళ్లిపోయి, ఎస్తేరు చెయ్యమన్నట్లు చేశాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in