ఎస్తేరు 3
3
యూదుల వినాశనానికి హామాను పథకం
1ఈ సంఘటనల తర్వాత అహష్వేరోషు మహారాజు హామానుకు గౌరవనీయ స్థానం ఇచ్చాడు. అగాగీయుడైన హామాను హమ్మెదాతా కొడుకు. మహారాజు హామానుకు ఉన్నత పదవి ఇచ్చి, అతన్ని మిగిలిన అధికారులందరికంటె ఉన్నత స్థానంలో ఉంచాడు. 2రాజభవన ద్వారం దగ్గర వుండే అధికారులందరూ హామానుకు మోకరిల్లి, నమస్కరించాలని మహారాజు ఆజ్ఞ జారీ చేశాడు. అధికారులందరూ ఈ ఆజ్ఞను పాటించేవారు. అయితే, మొర్దెకై మాత్రం మోకరిల్లేందుకూ, గౌరవాభివందనం చేసేందుకూ నిరాకరించాడు. 3అప్పుడు ద్వారం దగ్గరి ఉద్యోగులు మొర్దెకైని “హామాను ముందు మోకరిల్లాలన్న మహారాజు ఆజ్ఞను నువ్వెందుకు పాటించడం లేదు?” అని ప్రశ్నించారు.
4ఆ రాజోద్యోగులు ప్రతిరోజూ మొర్దెకైతో ఈ విషయమై ప్రస్తావించేవారు. అయితే, హామాను ముందు మోకరిల్లాలన్న ఆజ్ఞను పాటించేందుకు మొర్దెకై తిరస్కరిస్తూ వచ్చాడు. దానితో, ఆ ఉద్యోగులు ఈ విషయాన్ని హామానుకు తెలియ జెప్పారు. మొర్దెకై విషయంలో హామాను ఏమి చేస్తాడో చూద్దామనుకున్నారు. తను యూదుడనన్న విషయాన్ని మొర్దెకై ఆ ఉద్యోగులకు చెప్పాడు. 5మొర్దెకై తన ముందు మోకరిల్లి, గౌరవాభివందనం చేసేందుకు నిరాకరించాడని విన్న హామాను చాలా కోపం చెందాడు. 6మొర్దెకై యూదుడు అన్న విషయం హామానుకు తెలిసింది. అయితే, ఒక్క మొర్దెకైని మాత్రమే చంపడం అతనికి తృప్తికరంగా కనిపించలేదు. మొర్దెకై జాతీయులందర్నీ, అంటే, అహష్వేరోషు సామ్రాజ్యంలోని రాజ్యాలన్నింట్లో గల యూదులందర్నీ సమూలంగా నాశనం చేసే మార్గం వెదక నారంభించాడు.
7మహారాజు అహష్వేరోషు పాలనలో పన్నెండవ సంవత్సరం, నీసాను అనబడే మొదటి నెలలో హామాను తన కార్యక్రమానికి మంచి రోజును, నెలను ఎంచుకొనేందుకు చీటీలు వేశాడు. (ఆ రోజుల్లో ఈ చీటీలను “పూరు” అనేవారు). దాంట్లో అదారు అనబడే పన్నెండవ నెల ఎన్నిక చేయబడింది. 8అప్పుడిక హామాను అహష్వేరోషు మహారాజు దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: “మహారాజా, మీ సామ్రాజ్యంలోని అన్ని సామంత రాజ్యాల్లోనూ చెదురుమదురుగా ఒక జాతివాళ్లు వున్నారు. వాళ్లు ఆ దేశాల ప్రజలతో కలిసివుండక వేరుగా వుంటారు. వాళ్ల ఆచార సంప్రదాయాలు మిగిలిన ప్రజల వాటికి భిన్నమైనవి. వాళ్లు మహారాజు శాసనాలను పాటించరు. వాళ్లను మీ సామ్రాజ్యంలో ఉండనివ్వడం క్షేమ దాయకం కాదు.
9“మహారాజు మన్నిస్తే నాదొక సలహా. ఆ జాతి ప్రజలను హతమార్చేందుకు ఆజ్ఞ జారీ చెయ్యండి. ఇందుకయ్యే ఖర్చుకుగాను నేను 10,000 వెండి నాణ్యాలు రాజ్య ఖజానాలో జమకడతాను. ఈ కార్య క్రమాన్ని నిర్వహించేవారికి వేతనాలు చెల్లించేందుకు ఈ మొత్తాన్ని వినియోగించవచ్చు.”
10మహారాజు రాజముద్రిక ఉన్న ఉంగరాన్ని తీసి హామానుకు ఇచ్చాడు. హామాను అగాగీయుడైన హమ్మెదాతా కొడుకు. హామాను యూదులకు బద్ధ శత్రువు. 11మహారాజు హామానుతో ఇలా అన్నాడు, “ఆ సొమ్ము నీ దగ్గరే వుంచుకో. ఆ జాతివాళ్ల విషయంలో నువ్వేమి చెయ్యదలచుకున్నావో చెయ్యి.”
12అటు తర్వాత మొదటి నెల 13వ రోజున మహారాజుగారి లేఖకులు పిలువనంపబడ్డారు. వాళ్లు హామాను ఆజ్ఞలన్నింటినీ ఒక్కొక్క దేశపు భాషాలిపిలో వ్రాశారు. వాళ్లు వాటిని ఆయా ప్రజాబృందాల భాషల్లో వ్రాశారు. వాళ్లు మహారాజు సామంతులకు, ఆయా ప్రాంతాల పాలకులకు ఆ తాఖీదులు పంపారు. వాళ్లు ఆ తాఖీదులను మహారాజు పేరిట, మహారాజు ముద్రికతో పంపారు.
13వార్తాహరులు ఆయా సామంత దేశాలకు యీ తాఖీదు పత్రాలను తీసుకెళ్లారు. యూదులందర్నీ చంపి వేయాలి, ఆ జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయాలి, యిదీ మహారాజు ఆజ్ఞ. అంటే, యూదులందరూ పిల్లపాపలూ, యువతీ యువకులూ, ముసలి, వయస్సులో వున్నవాళ్లు, వయస్సు మళ్లినవాళ్లు, ఒక్కరోజులో హతమార్చ బడాలన్నమాట. ఆ రోజు అదారు అనబడే 12వ నెలలో 13వ రోజు అవుతుంది. ఆ ఆజ్ఞలో మరో అంశం యూదులకు చెందిన వస్తువులన్నింటినీ తీసేసు కోవడం. ఈలాగున ఆ తాఖీదు పత్రాలలో వ్రాయబడియున్నది.
14ఆ ఆజ్ఞల ప్రతులు రాజశాసనంగా అందరికీ పంపబడ్డాయి. ఈ తాఖీదును అన్ని సామంత రాజ్యాల్లోనూ శాసనంగా చెల్లుబడి చెయ్యాలి, దాన్ని సామ్రాజ్యంలో అన్ని జాతుల ప్రజలకీ ప్రకటించాలి. 15రాజాజ్ఞ మేరకు వార్తాహరులు హుటాహుటిగా బయల్దేరారు. రాజధాని నగరం షూషనులో కూడా యీ తాఖీదు ప్రతులు పంచబడ్డాయి. మహారాజూ, హామానూ మద్యం సేవిస్తూ కూర్చుండగా, అటు షూషను నగరం గందరగోళంలో మునిగిపోయింది.
Currently Selected:
ఎస్తేరు 3: TERV
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International