ఎస్తేరు 2
2
ఎస్తేరు రాణి అయింది
1దరిమిలా కొంత కాలానికి, అహష్వేరోషు మహారాజు కోపం చల్లారింది. అప్పుడాయనకి వష్తీ, ఆమె చేసిన పని, తను జారీచేసిన ఆజ్ఞలు జ్ఞాప్తికి వచ్చాయి. 2అప్పుడు మహారాజు ఆంతరంగిక సేవకులు ఒక సూచన చేశారు, “మహారాజుగారి కోసం అందమైన కన్యల అన్వేషణ జరపాలి. 3మహారాజు తన సామ్రాజ్యం లోని ప్రతి సామంత రాజ్యంలోనూ ఒక్కొక్క నాయకుణ్ణి ఎంపిక చేసుకోవాలి. ఆ నాయకులు అందమైన ప్రతి ఒక్క కన్యనూ రాజధాని నగరమైన షూషనుకి తీసుకురావాలి. ఆ కన్యలను మహారాజుగారి అంతఃపుర స్త్రీల బృందంలో వుంచాలి. ఆ కన్యలు అంతఃపుర స్త్రీలను అదుపాజ్ఞల్లో వుంచే హేగే నపుంసకుని అధీనంలోవుంటారు. వాళ్లందరికీ సౌందర్య పోషక క్రియలు జరపాలి. 4అటు తర్వాత వీళ్లలో మహారాజుకి నచ్చిన కన్యను వష్తి స్థానంలో కొత్త మహారాణిని చేయాలి.” ఈ సలహా మహారాజుకి నచ్చింది. ఆయన దాన్ని ఆమోదించాడు.
5రాజధాని నగరం షూషనులో బెన్యామీను గోత్రానికి చెందిన మొర్దెకై అనే ఒక యూదుడు వున్నాడు. మొర్దెకై తండ్రి యాయీరు. యాయీరు తండ్రి కీషు. 6బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను బందీగా పట్టుకొన్నాడు యెరూషలేము నుంచి చెరపట్టబడినవారిలో మొర్దెకై కూడా ఒకడు. 7హదస్సా అనే ఒక అమ్మాయి వుంది. ఆమె మొర్దెకైకి పినతండ్రి కూతురు. ఆమె తల్లితండ్రులు మరణించినప్పుడు, మొర్దకై ఆమెని చేరదీసి, తన స్వంత కూతురులా పెంచి పోషించాడు. హదస్సాకి ఎస్తేరు అనే పేరుకూడా వుంది. ఎస్తేరు అందమైన రూపమును సుందర ముఖమును గలదై యుండెను.
8మహారాజుయొక్క ఆజ్ఞ ప్రకటింపబడిన మీదట చాలామంది కన్యలు రాజధాని అయిన షూషను నగరానికి తరలింపబడ్డారు. వాళ్లందరూ హేగే నపుంసకుని అధీనంలో ఉంచబడ్డారు. ఆ యువతుల్లో ఎస్తేరు ఒకతె. ఎస్తేరును రాజభవనానికి తీసుకుపోయి, మిగిలిన అంతఃపుర స్త్రీలతో బాటు హేగే అధీనంలో ఉంచారు. 9ఎస్తేరు హేగేకి నచ్చింది. ఆమె అతనికి అభిమాన ప్రాత్రురాలైంది. దానితో హేగే ఆమెకి సౌందర్యవర్థక పక్రియను త్వరలో పూర్తిచేసి, ఆమెకి ప్రత్యేకమైన భోజన పదార్థాలను సమకూర్చాడు. అప్పుడిక హేగే ఎస్తేరుకీ, ఆమె ఏడుగురు పరిచారికలకీ అంతఃపుర స్త్రీలు నివసించే అతి శ్రేష్ఠమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేశాడు. 10తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు ఎవ్వరికీ చెప్పలేదు. మొర్దెకై వద్దన్నందున ఆమె తన కుటుంబ వివరాలేవీ ఎవ్వరికి తెలియ జెప్పలేదు. 11ఎస్తేరు ఎలాగుందో, ఆమె విషయంలో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకోసం మొర్దెకై ప్రతి రోజూ అంతఃపుర ఆవరణ ముందు అటు ఇటు తిరుగులాడు తుండేవాడు.
12ఎవరైనా ఒక యువతి అహష్వేరోషు మహారాజు సన్నిధానానికి తీసుకుపోబడేందుకు ముందు ఆమె చేయవలసిన పనులు యివి: ఆమె తన పన్నెండు మాసాల సౌందర్యవర్ధక పక్రియను వూర్తి చేయాలి. అంటే, ఆమె ఆరునెలలు పాటు గోపరస తైలాన్ని వాడి, తదుపరి ఆరునెలలు పరిమళ ద్రవ్యాలను, భిన్న భిన్న మైన అలంకరణ సామగ్రులను వాడాలి. 13మహారాజు సముఖానికి తీసుకుపోబడేందుకు ఇదీ పద్దతి. ఆ అమ్మాయికి ఏది కావాలన్నా అంతఃపురం నుంచి ఇవ్వబడుతుంది. 14ఆ యువతి రాజ భవనానికి సాయంత్రమందు చేరుకుంటుంది. ఆ మరుసటి ఉదయం ఆమె అంతఃవుర స్త్రీలు నివసించే మరో చోటికి తిరిగి వెళ్తుంది. అప్పుడామె అక్కడ షయష్గజు అనే నపుంసకుని అజమాయిషీలో ఉంచబడుతుంది. షయష్గజు నపుంసకుడు మహారాజు ఉంపుడుగత్తెల పర్యవేక్షకుడు. మహారాజుకు ఆమెపట్ల ప్రేమ కలిగినప్పుడేగాని ఆ యువతి ఆయన దగ్గరకు వెళ్లరాదు. అప్పుడాయన ఆమెను పేరుపెట్టి తిరిగి తనవద్దకు రమ్మని పిలుస్తాడు.
15ఎస్తేరుకి మహారాజు వద్దకు వెళ్లే వంతు వచ్చి నప్పుడు, ఆమె ఏమీ కావాలని కోరలేదు. అంతఃపుర పర్యవేక్షకుడైన హేగే తనకేమి సూచించాడో అవే తీసుకుంది. (ఎస్తేరు మొర్దెకై పెంపుడు కూతురు, అతని పినతండ్రి అబీహాయిలు కూతురు). ఎస్తేరును చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె నచ్చింది. 16చివరికి ఎస్తేరు రాజ భవనంలో మహారాజు సముఖానికి తీసుకెళ్లబడింది. అది సరిగ్గా టెబేతు అనబడే పదోనెల, అహష్వేరోషు పాలనలో ఏడవ సంవత్సరం.
17మహారాజు యువతులందరిలోకీ ఎస్తేరును బాగా ప్రేమించాడు. మిగిలిన కన్యలందరి కంటె ఆమె, ఆయన దయ, అభిమానాలను పొందింది. అందుకని మహారాజు స్వయంగా ఆమె శిరస్సుపై కిరీటం వుంచి, వష్తి స్థానంలో ఆమెను మహారాణిని చేశాడు. 18మహారాజు ఎస్తేరు గౌరవార్థం తన సామంతులకూ, అధికారులకూ పెద్ద విందు చేశాడు. అన్ని సామంత రాజ్యాల్యోనూ ఆ రోజును ఆయన సెలవు దినంగా ప్రకటించాడు. ఉదారవంతుడైన ఆ మహారాజు జనానికి బహుమతులు పంపాడు.
మొర్దెకై ఒక కుట్రను కనిపెట్టుట
19రెండవసారి యువతులందరూ ఒకచోట చేర్చబడినప్పుడు మొర్దెకై మహారాజు భవన ద్వారంవద్దనే కూర్చుని వున్నాడు. 20తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు యింకా గుప్తంగానే వుంచింది. తన కుటుంబ గోత్రాలను గురించి ఆమె ఎవ్వరికీ చెప్పలేదు. అది ఆమెకు మొర్దెకై ఇచ్చిన ఆజ్ఞ. తను మొర్దెకై పెంపకంలో ఉన్నప్పటి మాదిరిగానే, యింకా ఆమె అతని ఆజ్ఞలను పాటిస్తోంది.
21మొర్దెకై మహారాజు భవన ద్వారం దగ్గర కూర్చున్న సమయంలో జరిగిన విషయం ఇది: బిగ్తాను, తెరెషు అనే యిద్దరు రాజభవన ద్వార పాలకులు మహారాజువట్ల కుపితులై అహష్వేరోషు మహారాజును హతమార్చాలని కుట్ర పన్నుతున్నారు. 22అయితే, మొర్దెకై ఈ కుట్ర పథకాలను కనిపెట్టి ఎస్తేరు మహారాణికి ఈ విషయం చెప్పాడు. అప్పుడీ విషయాన్ని ఆమె మహారాజుకి చెప్పింది. ఈ కుట్రను గురించి తెలుసుకున్నది మొర్దెకై అని కూడా ఆమె మహారాజుకు చెప్పింది. 23తర్వాత ఆ విషయమై విచారణ చేయబడింది. విచారణలో మొర్దెకై చెప్పిన సమాచారం సరైనదేనని తేలింది. మహారాజును హత్యచేయాలని దుష్ట వథకం వేసిన ద్వారపాలకులిద్దరూ ఉరితీయబడ్డారు. మహారాజు సమక్షంలోనే యీ విషయాలన్నీ మహారాజుల చరిత్ర విశేషాల గ్రంథంలో నమోదు చేయబడ్డాయి.
Currently Selected:
ఎస్తేరు 2: TERV
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International