ఎస్తేరు 6
6
మొర్దెకైకి గౌరవ సత్కారాలు
1సరిగ్గా ఆ రాత్రి మహారాజుకి నిద్రపట్టలేదు. అందుకని రాజవంశ చరిత్ర గ్రంథాన్ని తెచ్చి తనకి చదివి వినిపించమని ఒక ఉద్యోగికి పురమాయించాడు. (ఆ చరిత్ర గ్రంథంలో ఒక్కొక్క రాజు పరిపాలన కాలంలో సంభవించిన ప్రతి సంఘటనా నమోదు చెయ్యబడుతుంది.) 2ఆ ఉద్యోగి మహారాజుకి ఆ గ్రంథం చదివి వినిపించాడు. అహష్వేరోషు మహారాజును హత్య చేసేందుకు బిగ్తాను, తెరెషు అనే యిద్దరు రాజభవన ద్వారపాలకులు చేస్తున్న కుట్ర గురించి మొర్దెకై పసిగట్టి, ఆ సమాచారాన్ని ఎపరికో తెలియజెయ్యడం గురించి ఆ ఉద్యోగి చదివాడు.
3అప్పుడు మహారాజు, “ఇందుకు ప్రతిఫలంగా ఆ మొర్దెకైకి ఎలాంటి ఆదర సత్కారాలు జరిగాయి?” అని ప్రశ్నించాడు.
“మొర్దెకైకి ఎలాంటి పారితోషికమూ దొరకలేదు మహారాజా” అని ఉద్యోగులు సమాధానమిచ్చారు.
4హామాను సరిగ్గా అప్పుడే రాజభవనపు వెలుపటి ఆవరణలో ప్రవేశించాడు. తను నాటింపజేసిన ఉరి కంబం మీద మొర్దెకైని ఉరితీయించేందుకు మహారాజు అనుమతిని కోరేందుకే అతను వచ్చాడు. అతని అడుగుల చప్పుడు మహారాజు విన్నాడు. “ఆవరణ లోపలికి వచ్చింది ఎవరు?” అన్న మహారాజు ప్రశ్నకి 5రాజోద్యోగులు “హామాను ఆవరణలో వేచివున్నాడు మహారాజా” అని సమాధానమిచ్చారు.
మహారాజు, “అతన్ని లోపలికి తీసుకురండి” అని ఆదేశించాడు.
6హామాను లోపలికి వచ్చాక మహారాజు అతన్ని, “మహారాజు ఎవరికైనా గౌరవ సత్కారాలు చెయ్యాలంటే, ఏం చెయ్యాలి హామానూ” అని ప్రశ్నించాడు.
హామాను తనలో తను, “మహారాజు నన్ను కాక మరెవరిని సత్కరించాలని అనుకుంటారు? మహారాజు అంటున్నది నిస్సందేహంగా నన్ను సత్కరించాలనే అయివుంటుంది.” అని తర్కించుకున్నాడు.
7దానితో హమాను మహారాజుకి ఇలా సమాధాన మిచ్చాడు: “మహారాజు గౌరవించాలనుకున్న వ్యక్తి విషయంలో యిలా చెయ్యాలి. 8మహారాజు స్వయంగా ధరించిన రాజవస్త్రాలను సేవకులచేత తెప్పించాలి. మహారాజు స్వారీచేసిన ఒక గుర్రాన్ని కూడా తెప్పించాలి. సేవకులచేత ఆ గుర్రం ముఖాన తురాయివంటి ప్రత్యేకమైన ఒక గుర్తు వేయించాలి. 9తర్వాత ఆ పట్టు వస్త్రాన్ని, ఆ గుర్రాన్నీ ఒక ప్రముఖ ఉద్యోగి వద్ద వుంచాలి. అప్పుడు మహారాజు సత్కరించాలనుకున్న ఆ వ్యక్తిని ఆ ముఖ్య అధికారి గుర్రం మీద కూర్చోబెట్టి నగర వీధుల్లో ఊరేగిస్తూ, ‘ఈయనకి మహారాజు చేస్తున్న సన్మానం ఇది’ అంటూ చాటాలి.”
10అప్పుడు మహారాజు హామానుకి ఇలా ఆజ్ఞాశించాడు: “వెన్వెంటనే పోయి, పట్టు వస్త్రాలూ గుర్రము తీసుకువచ్చి. భవనద్వారం దగ్గర కూర్చున్న యూదుడైన మొర్దెకైకి నువ్వు చెప్పిన సత్కార కార్యక్రమమంతా అమలు జరుపుము.”
11హామాను పోయి పట్టు వస్త్రమూ, గుర్రమూ తెచ్చాడు. ఆ వస్త్రాన్ని మొర్దెకైకి కప్పి, అతన్ని గుర్రం మీద కూర్చోబెట్టి, తను గుర్రం ముందు నడుస్తూ మొర్దెకైని నగర వీధుల్లో ఊరేగిస్తూ, “మహారాజు సత్కరించ కోరిన వ్యక్తికి జరుగుతున్న సన్మానం ఇదే” అని చాటాడు.
12అటు తర్వాత మొర్దెకై రాజభవన ద్వారం దగ్గరికి తిరిగి వెళ్లాడు. కాని, హామాను సిగ్గుతో తల్లడిల్లుతూ హడావిడిగా ఇంటికి వెళ్లిపోయాడు. 13తన భార్య జెరెషుకీ, తన మిత్రులందరికీ తనకి జరిగిన పరాభవ మంతటిని గురించి వివరంగా చెప్పాడు. హామాను భార్య, అతనికి ఇంతకు ముందు సలహా ఇచ్చిన మిత్రులూ అతనితో ఇలా అన్నారు: “మొర్దెకై యూదుడే అయితే, నీవు జయం పొందడం అసాధ్యం. నీ పతనం యిప్పటికే ప్రారంభమైంది. నీ నాశనం తథ్యం!”
14హామానుతో వాళ్లింకా మాట్లాడుతూనే పున్నారు. అంతలోనే మహారాజుగారి నపుంసకులు హామాను ఇంటికి వచ్చారు. వాళ్లు హామానుని ఎస్తేరు సన్నద్ధం చేసిన విందుకి వెళ్లేందుకు తొందరచేశారు.
Currently Selected:
ఎస్తేరు 6: TERV
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International