YouVersion Logo
Search Icon

జెకర్యా 9

9
1హద్రాకు దేశమునుగూర్చియు దమస్కు పట్టణమునుగూర్చియు వచ్చిన దేవోక్తి 2ఏలయనగా యెహోవా సర్వనరులను ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక, దాని సరిహద్దును అనుకొని యున్న హమాతునుగూర్చియు, జ్ఞాన సమృద్ధిగల తూరు సీదోనులనుగూర్చియు అది వచ్చెను. 3తూరు పట్టణపువారు ప్రాకారముగల కోటను కట్టుకొని, యిసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. 4యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనముచేసి దాని ఆస్తిని పరులచేతి కప్పగించును, అది అగ్నిచేత కాల్చబడును. 5అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణకును, ఎక్రోనుపట్టణము తాను నమ్ము కొనినది అవమానము నొందగా చూచి భీతినొందును, గాజారాజులేకుండపోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును. 6అష్డోదులో సంకరజనము కాపురముండును, ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసెదను. 7వారి నోటనుండి రక్తమును వారికను తినకుండ వారి పండ్లనుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను. వారును శేషముగా నుందురు, మన దేవునికి వారు యూదా వారిలో పెద్దలవలె నుందురు, ఎక్రోనువారును యెబూసీయులవలె నుందురు. 8నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరముమీదికి రాకుండను దానిని కాపాడుకొనుటకై నేనొక దండు పేటను ఏర్పరచెదను.
9సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. 10ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములులేకుండ చేసెదను, యుద్ధపు విల్లులేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును. 11మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను. 12బంధకములలో పడియుండియు నిరీక్షణగలవారలారా, మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. 13యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుచున్నాను, శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సీయోను కుమారులను మీమీదికి రేపుచున్నాను. 14యెహోవావారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపువలె విడువబడును, ప్రభువగు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణదిక్కునుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలు దేరును. 15సైన్యములకు అధిపతియగు యెహోవావారిని కాపాడును గనుక వారు భక్షించుచు, వడిసెలరాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు, ద్రాక్షారసము త్రాగువారివలె బొబ్బలిడుచు, బలిపశురక్త పాత్రలును బలిపీఠపు మూలలును నిండునట్లు రక్తముతో నిండియుందురు. 16నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. 17వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు; ధాన్యముచేత యౌవనులును క్రొత్త ద్రాక్షారసముచేత యౌవన స్త్రీలును వృద్ధి నొందుదురు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for జెకర్యా 9