జెకర్యా 8
8
1మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 2–సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా –మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించియున్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించియున్నాను. 3యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను సీయోను నొద్దకు మరల వచ్చి, యెరూషలేములో నివాసముచేతును, సత్యమును అనుసరించు పురమనియు, సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధపర్వతమనియు పేర్లు పెట్టబడును. 4సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపెట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు. 5ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోను ఆడుపిల్లలతోను నిండియుండును. 6సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా? యిదే యెహోవా వాక్కు. 7సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–తూర్పు దేశములోనుండియు పడమటి దేశములోనుండియు నేను నా జనులను రప్పించి రక్షించి 8యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులైయుందురు, నేను వారికి దేవుడనై యుందును; ఇది నీతి సత్యములనుబట్టి జరుగును. 9సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు నదేమనగా–సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాదివేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి. 10ఆ దినములకు ముందు మనుష్యులకు కూలి దొరకక యుండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయెను, తన పనిమీద పోవువానికి శత్రుభయముచేత నెమ్మది లేకపోయెను; ఏలయనగా ఒకరిమీదికొకరిని నేను రేపుచుంటిని. 11అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. 12సమాధానసూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశమునుండి మంచు కురియును, ఈ జనులలో శేషించినవారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 13యూదావారలారా, ఇశ్రాయేలువారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై యుంటిరో ఆలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును; భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. 14సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీపితరులు నాకు కోపము పుట్టింపగా దయ తలచక నేను మీకు కీడుచేయనుద్దేశించినట్లు 15ఈ కాలమున యెరూషలేమునకును యూదావారికిని మేలుచేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. 16మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. 17తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణముచేయ నిష్టపడకూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు; ఇదే యెహోవా వాక్కు.
18మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 19సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–నాలుగవ నెలలోని ఉపవాసము, అయిదవ నెలలోని ఉపవాసము, ఏడవ నెలలోని ఉపవాసము, పదియవ నెలలోని ఉపవాసము యూదా యింటివారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. 20సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–జనములును అనేక పట్టణముల నివాసులును ఇంకను వత్తురు. 21ఒక పట్టణపువారు మరియొక పట్టణపువారి యొద్దకు వచ్చి–ఆలస్యముచేయక యెహోవాను శాంతిపరచుటకును, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు–మేమును వత్తుమందురు. 22అనేక జనములును బలముగల జనులును యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. 23సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఆ దినములలో ఆయా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని–దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.
Currently Selected:
జెకర్యా 8: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.