YouVersion Logo
Search Icon

సామెతలు 5

5
1నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము
వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము
2అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు
తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.
3జారస్త్రీ పెదవులనుండి తేనె కారును
దాని నోటి మాటలు నూనెకంటెను నునుపైనవి
4దానివలన కలుగు ఫలము ముసిణిపండంత చేదు
అది రెండంచులుగల కత్తియంత పదునుగలది,
5దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును
దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును
6అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు
దానికి తెలియకుండనే దాని పాదములు ఇటు అటు
తిరుగును.
7కుమారులారా, నా మాట ఆలకింపుడి
నేను చెప్పు ఉపదేశమునుండి తొలగకుడి.
8జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి
దూరముగా చేసికొనుము
దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.
9వెళ్లినయెడల పరులకు నీ యౌవనబలమును
క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు
10నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు
నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును.
11తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు
12అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని?
నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను?
13నా బోధకుల మాట నేను వినకపోతిని
నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు
14నేను సమాజ సంఘములమధ్యనుండినను
ప్రతివిధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే
యెడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలు
గుచు నుందువు.
15నీ సొంతకుండలోని నీళ్లు పానము చేయుము
నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.
16నీ ఊటలు బయటికి చెదరిపోదగునా?
17వీధులలో అవి నీటి కాలువగా పారదగునా?
అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ
అవి నీకే యుండవలెను గదా.
18నీ ఊట దీవెన నొందును.
నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.
19ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి
ఆమె రొమ్ములవలన నీవు ఎల్లప్పుడు తృప్తినొందు
చుండుము.
ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.
20నా కుమారుడా, జార స్త్రీయందు నీవేల బద్ధుడవై
యుందువు?
పరస్త్రీ రొమ్ము నీవేల కౌగలించుకొందువు?
21నరుని మార్గములను యెహోవా యెరుగును
వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును.
22దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును
వాడు తన పాపపాశములవలన బంధింపబడును.
23శిక్షలేకయే అట్టివాడు నాశనమగును
అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for సామెతలు 5