YouVersion Logo
Search Icon

సామెతలు 4

4
1కుమారులారా, తండ్రి యుపదేశము వినుడి
మీరు వివేకమునొందునట్లు ఆలకించుడి
2నేను మీకు సదుపదేశము చేసెదను
నా బోధను త్రోసివేయకుడి.
3నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని
నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన యేక
కుమారుడనైయుంటిని.#4:3 లేక, ముద్దుబిడ్డ.
4ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను
– నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము
నా ఆజ్ఞలను గైకొనినయెడల నీవు బ్రతుకుదువు.
5జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము
నా నోటిమాటలను మరువకుము.
వాటినుండి తొలగిపోకుము.
6జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను
కాపాడును
దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.
7జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము.
నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.
8దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును.
దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.
9అది నీ తలకు అందమైన మాలిక కట్టును
ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.
10నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల
నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.
11జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను
యథార్థమార్గములో నిన్ను నడిపించియున్నాను.
12నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు.
నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
13ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము
అది నీకు జీవము గనుక దాని పొందియుండుము
14భక్తిహీనుల త్రోవను చేరకుము
దుష్టుల మార్గమున నడువకుము.
15దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము.
దానినుండి తొలగి సాగిపొమ్ము.
16అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు
ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
17కీడుచేత దొరికినదానిని వారు భుజింతురు
బలాత్కారముచేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు
18పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు
నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,
19భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము
తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
20నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము
నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
21నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్యకుము
నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.
22దొరికినవారికి అవి జీవమునువారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.
23నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును
కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును
భద్రముగా కాపాడుకొనుము
24మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము
పెదవులనుండి కుటిలమైన మాటలు రానియ్యకుము.
25నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను
నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను.
26నీవు నడచు మార్గమును సరాళము చేయుము
అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.
27నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము
నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in