సామెతలు 28
28
1ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును
నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.
2దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకులగుదురు
బుద్ధిజ్ఞానములుగలవారిచేత దాని అధికారము స్థిర
పరచబడును.
3బీదలను బాధించు దరిద్రుడు
ఆహారవస్తువులను ఉండనియ్యక కొట్టుకొనిపోవు
వానతో సమానుడు.
4ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడు
చుందురు
ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడుదురు.
5దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు
యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు.
6వంచకుడై ధనము సంపాదించినవానికంటె
యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి.
7ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు
తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి
అపకీర్తి తెచ్చును.
8వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు
దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.
9ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని
ప్రార్థన హేయము.
10యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు
తాను త్రవ్విన గోతిలో తానే పడును
యథార్థవంతులు మేలైనదానిని స్వతంత్రించుకొందురు.
11ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని
వివేకముగల దరిద్రుడు వానిని పరిశోధించును.
12నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము
దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు.
13అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము
పొందును.
14నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు
హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును.
15బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు
దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు.
16వివేకములేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు
అధికారీ,#28:16 లేక, వివేకములేని అధికారి జనులను అధికముగా బాధపెట్టును.
దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును.
17ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి
పరుగెత్తుచున్నాడు
ఎవరును అట్టివానిని ఆపకూడదు.
18యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును
మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.
19తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపునిండ
అన్నము దొరకును
వ్యర్థమైనవాటిని అనుసరించువారికి కలుగు పేదరికము
ఇంతంతకాదు.
20నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును.
ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు.
21పక్షపాతము చూపుట మంచిది కాదు
రొట్టెముక్కకొరకు ఒకడు దోషముచేయును.
22చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును
తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు.
23నాలుకతో ఇచ్చకములాడు వానికంటె
నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.
24తన తలిదండ్రుల సొమ్ము దోచుకొని–అది ద్రోహము
కాదనుకొనువాడు
నశింపజేయువానికి జతకాడు.
25పేరాసగలవాడు కలహమును రేపును
యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.
26తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు
జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.
27బీదలకిచ్చువానికి లేమి కలుగదు
కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలుగును.
28దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురువారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు.
Currently Selected:
సామెతలు 28: TELUBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.