సామెతలు 29
29
1ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు
మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.
2నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు
దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.
3జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోష
పరచును
వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని
పాడుచేయును.
4న్యాయము జరిగించుటవలన రాజు దేశమునకు
క్షేమము కలుగజేయును
లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు
చేయును.
5తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు
వాని పట్టుకొనుటకు వలవేయువాడు.
6దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును
నీతిమంతుడు సంతోషగానములు చేయును.
7నీతిమంతుడు బీదలకొరకు న్యాయము విచారించును
దుష్టుడు జ్ఞానము వివేచింపడు.
8అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు
జ్ఞానులు కోపము చల్లార్చెదరు.
9జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు
వాడు ఊరకుండక రేగుచుండును.
10నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు
అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.
11బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును
జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.
12అబద్ధముల నాలకించు రాజునకు
ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు
13బీదలును వడ్డికిచ్చువారును కలిసికొందురు
ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే.
14ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో
ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.
15బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును
అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.
16దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలునువారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచెదరు.
17నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష
పరచును
నీ మనస్సుకు ఆనందము కలుగజేయును
18దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు
ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు.
19దాసుడు వాగ్దండనచేత గుణపడడు
తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు
20ఆతురపడి మాటలాడువాని చూచితివా?
వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.
21ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి
గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును.
22కోపిష్ఠుడు కలహము రేపును
ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.
23ఎవని గర్వము వానిని తగ్గించును
వినయమనస్కుడు ఘనతనొందును
24దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు
అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు.
25భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును
యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.
26అనేకులు ఏలువాని దయ కోరుచుందురు
మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.
27దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు
యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.
Currently Selected:
సామెతలు 29: TELUBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.