YouVersion Logo
Search Icon

యిర్మీయా 38

38
1యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలు వెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ముదక్కించు కొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు. 2యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజలకందరికి ప్రకటింపగా 3-4మత్తాను కుమారుడైన షెఫట్యయును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా–ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరు వాడేగాని క్షేమము కోరువాడుకాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనముచేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. 5అందుకు రాజైన సిద్కియా– అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా 6వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను. 7-8రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటి లోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు, వారు యిర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులోనుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను 9రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు ఆకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు. 10అందుకు రాజు–నీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్తయైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా 11-12ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి, అచ్చటనుండి పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొనిపోయి, ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటినిదింపి–పాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీద నీ చంకలక్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను. 13యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.
14తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న మూడవ ద్వారములోనికి ప్రవక్తయైన యిర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెను–నేను ఒకమాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా 15యిర్మీయా–నేను ఆ సంగతి నీకు తెలియజెప్పినయెడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు, నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. 16కావున రాజైన సిద్కియా–జీవాత్మను మన కనుగ్రహించు యెహోవాతోడు నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న యీ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహ స్యముగా ప్రమాణము చేసెను. 17అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెను–దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీవు బబులోనురాజు అధిపతులయొద్దకు వెళ్లినయెడల నీవు బ్రదికెదవు, ఈపట్టణము అగ్నిచేత కాల్చ బడదు, నీవును నీ యింటివారును బ్రదుకుదురు. 18అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లనియెడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్నిచేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలవు. 19అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను–కల్దీయుల పక్షముగాఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహ సించెదరు. 20అందుకు యిర్మీయా–వారు నిన్నప్పగింపరు, నీవు బ్రదికి బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతినిగూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. 21నీవు ఒకవేళ బయలు వెళ్లక పోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను. 22–యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్ర్రీలు నిన్ను చూచి–నీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరనియందురు. 23నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు. 24అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను–నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము. 25నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినినయెడల వారు నీయొద్దకు వచ్చి–మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగుచేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా 26నీవు–యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను. 27అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయ నందునవారు అతనితో మాటలాడుట మానిరి. 28యెరూషలేము పట్టబడువరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 38