YouVersion Logo
Search Icon

యిర్మీయా 39

39
1యూదారాజైన సిద్కియా యేలుబడియందు . తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికివచ్చి దాని ముట్టడివేయగా 2సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవదినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. 3యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సమ్గర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతులందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి. 4యూదులరాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడలమధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను. 5అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గర నున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి 6బబులోనురాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోనురాజు యూదా ప్రధానులందరిని చంపించెను. 7అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను. 8కల్దీయులు రాజనగరును ప్రజలయిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. 9అప్పుడు రాజదేహ సంరక్షకులకధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను. 10అయితే రాజదేహసంరక్షకులకధిపతియైన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదాదేశములో నుండనిచ్చి, వారికి ద్రాక్షతోటలను పొలములను నియమించెను. 11-12మరియు యిర్మీయానుగూర్చి బబులోను రాజైన నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను–నీవు ఇతనికి హాని చేయక దగ్గరనుంచుకొని పరామర్శించి, ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను. 13కావున రాజదేహసంరక్షకులకు అధిపతియైన నెబూజరదానును షండులకు అధిపతియగు నెబూషజ్బానును జ్ఞానులకు అధిపతియగు నేర్గల్‌షరే జరును బబులోనురాజు ప్రధానులందరును దూతలను పంపి 14బందీగృహశాలలోనుండి యిర్మీయాను తెప్పించి, అతనిని యింటికి తోడుకొనిపోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతని నప్పగించిరి, అప్పుడతడు ప్రజలమధ్య నివాసముచేసెను.
15యిర్మీయా బందీగృహశాలలోనుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 16–నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మేలుచేయుటకైకాక కీడుచేయుటకై నేను ఈ పట్టణమునుగూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను; నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. 17ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 18నీవు నన్ను నమ్ము కొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గముచేత పడవు, దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు; ఇదే యెహోవా వాక్కు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for యిర్మీయా 39