YouVersion Logo
Search Icon

యిర్మీయా 37

37
1బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యముచేయుచుండెను. 2అతడైనను అతని సేవకులైనను దేశప్రజలైనను యెహోవా ప్రవక్తయైన యిర్మీయాచేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు.
3రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహు కలును యాజకుడైన మయశేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్తయైన యిర్మీయాయొద్దకు పంపి–దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవిచేసెను. 4అప్పటికి వారు యిర్మీయాను చెరసాలలో నుంచియుండ లేదు; అతడు ప్రజలమధ్య సంచరించుచుండెను. 5ఫరో దండు ఐగుప్తులోనుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడివేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గరనుండి బయలుదేరిరి. 6అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 7ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–నాయొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వీలాగు చెప్పవలెను–మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చు చున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్లును. 8కల్దీయులు తిరిగి వచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు. 9యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనే వెళ్లరు. 10మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.
11ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుటనుండి వెళ్లిపోగా 12యిర్మీయా బెన్యామీను దేశములో తనవారియొద్ద భాగము తీసికొనుటకై యెరూషలేమునుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా 13ఇరీయా అను కావలివారి అధిపతి అక్కడ నుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొని–నీవు కల్దీయులలో చేరబోవుచున్నావని చెప్పగా 14యిర్మీయా–అది అబద్ధము, నేను కల్దీయులలో చేరబోవుటలేదనెను. అయితే అతడు యిర్మీయామాట నమ్మనందున ఇరీయా యిర్మీయాను పట్టుకొని అధిపతులయొద్దకు తీసికొని వచ్చెను. 15అధిపతులు యిర్మీయామీద కోపపడి అతని కొట్టి, తాము బందీగృహముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి. 16-17యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను; పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి, అతని తన యింటికి పిలిపించి–యెహోవాయొద్దనుండి ఏ మాటై నను వచ్చెనా అని యడుగగా యిర్మీయా–నీవు బబులోను రాజుచేతికి అప్పగింపబడెదవను మాటవచ్చెననెను. 18మరియు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లనెను–నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి? 19బబులోను రాజు మీమీది కైనను ఈ దేశముమీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు? 20రాజా, నా యేలినవాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్ని ధికి రానిమ్ము, నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపకుము. 21కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహ శాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంతవరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in