యిర్మీయా 16
16
1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొనకూడదు. 3ఈ స్థలమందు పుట్టు కుమారులనుగూర్చియు, కుమార్తెలనుగూర్చియు, వారిని కనిన తల్లులనుగూర్చియు, ఈ దేశములో వారిని కనిన తండ్రులనుగూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు 4–వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంటవలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. 5యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు. 6ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొనకుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు. 7చచ్చినవారినిగూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు; ఒకని తండ్రియైనను తల్లియైనను చనిపోయెనని యెవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు. 8వారియొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందు శాలలో ప్రవేశింపకూడదు. 9సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండ మాన్పించెదను. 10నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియ జెప్పిన తరువాత వారు–దేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మాపాప మేమి? అని నిన్నడుగగా 11నీవు వారితో ఇట్లనుము– యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–మీపితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటనుబట్టియే గదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి. 12ఆలకించుడి; మీరందరు నా మాట వినకుండ కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు; మీరు మీపితరులకంటె విస్తారముగా చెడుతనము చేసియున్నారు. 13కాబట్టి నేను మీయందు ఏమాత్రమును దయయుంచక, యీ దేశమునుండి మీరైనను మీపితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను; అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు.
14-15యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా–నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలో–ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట అనక–ఉత్తరదేశములోనుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలోనుండియు ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు. 16ఇదే యెహోవా వాక్కు– వారిని పట్టుకొనుటకు నేను చాలమంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతముమీదనుండియు ప్రతి కొండమీద నుండియు మెట్టల సందులలోనుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. 17ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు. 18వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్రపరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమునుబట్టియు వారి పాపమునుబట్టియు రెండంతలుగా వారికి ప్రతికారము చేసెదను. 19యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చి– మా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. 20నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు. 21కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును.
Currently Selected:
యిర్మీయా 16: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.