యిర్మీయా 17
17
1వారి కుమారులు తాముకట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్తంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా 2యూదా పాపము ఇనుపగంట ముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయములనెడి పలకలమీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ములమీదను చెక్కబడియున్నది. 3పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవుచేయు నీ పాపమునుబట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని నీ బలిపీఠములను దోపుడుసొమ్ముగా నేనప్పగించుచున్నాను. 4మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడ వగుదువు.
5యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. –నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. 6వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును. 7యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. 8వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు. 9హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు? 10ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. 11న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించు కొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువ వలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.
12ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము.#17:12 లేక, మహిమా సింహాసనమా, మొదటినుండి యున్నతస్థలమా, మా పరిశుద్ధాలయస్థానమా. 13ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు. 14యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడు దును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతు డవు. 15వారు–యెహోవా వాక్కు ఎక్కడనున్నది? దాని రానిమ్మని యనుచున్నారు. 16నేను నిన్ను అనుసరించు కాపరినైయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు, నీకే తెలిసియున్నది. నా నోటినుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. 17ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము. 18నన్ను సిగ్గుపడనియ్యక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులుపడనియ్యక వారిని దిగులు పడనిమ్ము, వారిమీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము.
19యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు–నీవు వెళ్లి యూదారాజులు వచ్చుచు పోవుచునుండు జనుల గుమ్మము నను యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీని ప్రకటన చేయుము 20–యూదారాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైనవారలారా, యెహోవా మాట వినుడి. 21యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మీ విషయములో జాగ్రత్తపడుడి, విశ్రాంతిదినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండ ఏ బరువును తీసికొని రాకుడి. 22విశ్రాంతిదినమున మీ యిండ్లలోనుండి యే బరువును మోసికొని పోకుడి, యే పనియు చేయకుడి, నేను మీపితరుల కాజ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును ప్రతిష్ఠితదినముగా ఎంచుకొనుడి. 23అయితే వారు వినకపోయిరి, చెవినిబెట్టక పోయిరి, వినకుండను బోధనొందకుండను మొండికి తిరిగిరి. 24మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను–మీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతిదినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి, విశ్రాంతిదినమున ఈ పట్టణపు గుమ్మములలోగుండ ఏ బరువును తీసికొని పోకుండినయెడల 25దావీదు సింహాసనమందు ఆసీనులై, రథములమీదను గుఱ్ఱములమీదను ఎక్కి తిరుగుచుండు రాజులును అధిపతులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులును యూదావారును యెరూషలేము నివాసులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు; మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. 26మరియు జనులు దహనబలులను బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసికొని యూదా పట్టణములలోనుండియు, యెరూషలేము ప్రాంతములలోనుండియు, బెన్యామీను దేశములోనుండియు, మైదానపు దేశములోనుండియు, మన్యములోనుండియు, దక్షిణదేశములోనుండియు వచ్చె దరు; యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసికొని వచ్చెదరు. 27అయితే మీరు విశ్రాంతిదినమును ప్రతిష్ఠితదినముగా నెంచి, ఆ దినమున బరువులు మోసి కొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు విననియెడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును.
Currently Selected:
యిర్మీయా 17: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.