ఎజ్రా 8
8
1రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశమునుండి నాతోకూడ వచ్చిన యింటి పెద్దల వంశావళి. 2–ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును, 3షెకన్యా పరోషుల వంశములలో జెకర్యాయు వంశా వళికి నూట ఏబదిమంది పురుషులును లెక్కింపబడిరి. 4పహత్మోయాబు వంశములో జెరహ్య కుమారుడైన ఎల్యో యేనైయు రెండు వందలమంది పురుషులును 5షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును మూడువందలమంది పురుషులును 6ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును ఏబదిమంది పురుషులును 7ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బదిమంది పురుషులును 8షెఫట్య వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు ఎనుబదిమంది పురుషులును 9యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబ ద్యాయు రెండువందల పదునెనిమిదిమంది పురుషులును 10షెలోమీతు వంశములో యోసిప్యా కుమారుడును నూట అరువదిమంది పురుషులును 11బేబై వంశములో బేబై కుమారుడైన జెకర్యాయు ఇరువది ఎనిమిదిమంది పురుషులును 12అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును నూటపదిమంది పురుషులును 13అదోనీ కాముయొక్క చిన్న కుమారులలో ఎలీపేలెటును యెహీయేలును షెమయాయు అరువదిమంది పురుషులును 14బిగ్వయి వంశములో ఊతైయును జబ్బూదును డెబ్బదిమంది పురుషులును.
15వీరిని నేను అహవా వైపునకు పారు నదియొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము మూడుదినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనికీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు. 16అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు అరీయేలు షెమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జెకర్యా మెషుల్లాము అను వారిని, ఉపదేశకులగు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి 17–కాసిప్యా అను స్థల మందుండు అధికారియైన ఇద్దోయొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మాయొద్దకు తీసికొని వచ్చునట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోను అతని బంధువులైన నెతీనీయులతోను చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని. 18మా దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందునవారు ప్రజ్ఞావంతుడైన ఒక నిని షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను, పదు నెనిమిదిమందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు; ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. 19హషబ్యాను అతనితోకూడ మెరారీయుడగు యెషయాను అతని బంధువులను వారి కుమారులునైన యిరువదిమందిని వారు తోడుకొని వచ్చిరి. 20మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులును నిర్ణయించిన నెతీనీయులలో రెండువందల ఇరువదిమంది వచ్చిరి. వీరందరును పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు. 21అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. 22–మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తముతోడుగా ఉండునుగాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. 23మేము ఉపవాసముండి ఆ సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను 24గనుక నేను యాజకులలోనుండి ప్రధానులైన పండ్రెండు మందిని, అనగా షేరేబ్యాను హషబ్యాను వీరి బంధువులలో పదిమందిని ఏర్పరచి 25మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులును అధిపతులును అక్కడ నున్న ఇశ్రాయేలీయులందరును ప్రతిష్ఠించిన వెండిబంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని. 26వెయ్యిన్ని మూడువందల మణుగుల వెండిని రెండువందల మణుగుల వెండి ఉపకరణములను, రెండువందల మణుగుల బంగారమును, 27ఏడువేల తులములుగల యిరువది బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి 28వారిచేతికి అప్పగించి–మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడినవారు, పాత్రలును ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములును మీపితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై యున్నవి. 29కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో, యాజకులయొక్కయు లేవీయులయొక్కయు ఇశ్రాయేలు పెద్దలయొక్కయు ప్రధానులైన వారియెదుట, వాటిని తూచి అప్పగించువరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని. 30కాబట్టి యాజకులును లేవీయులును వాటి యెత్తు ఎంతో తెలిసికొని, యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసికొనిరి.
31మేము మొదటి నెల పండ్రెండవదినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నదినుండి బయలుదేరగా, మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి, శత్రువుల చేతిలోనుండియు మార్గమందు పొంచియున్నవారి చేతిలోనుండియు మమ్మును తప్పించినందున 32మేము యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడ బసచేసితిమి. 33నాలుగవదినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితోకూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి. 34సంఖ్యచొప్పునను ఎత్తుచొప్పునను అన్నిటిని సరిచూచిన తరువాత వాటి యెత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి. 35మరియు చెరలోనికి కొనిపోబడినవారికి పుట్టి చెరనుండి విడుదలనొంది తిరిగి వచ్చినవారు ఇశ్రాయేలీయుల దేవునికి దహనబలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరికొరకు పండ్రెండు ఎడ్లను తొంబది యారు పొట్టేళ్లను డెబ్బదియేడు గొఱ్ఱెపిల్లలను, పాపపరిహారార్థబలిగా పండ్రెండు మేకపోతులను తెచ్చి అన్నిటిని దహనబలిగా యెహోవాకు అర్పించిరి. 36వారు రాజుయొక్క నిర్ణయములను రాజుయొక్క సేనాధిపతులకును నది యివతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి.
Currently Selected:
ఎజ్రా 8: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.