YouVersion Logo
Search Icon

ఎజ్రా 7

7
1ఈ సంగతులు జరిగినపిమ్మట పారసీకదేశపు రాజైన అర్తహషస్తయొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడైయుండెను, శెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కీయా కుమారుడు 2హిల్కీయా షల్లూము కుమారుడు షల్లూము సాదోకు కుమారుడు సాదోకు అహీటూబు కుమారుడు 3అహీటూబు అమర్యా కుమారుడు అమర్యా అజర్యా కుమారుడు అజర్యా మెరాయోతు కుమారుడు 4మెరాయోతు జెరహ్యా కుమారుడు జెరహ్యా ఉజ్జీ కుమారుడు ఉజ్జీ బుక్కీ కుమారుడు 5బుక్కీ అబీషూవ కుమారుడు అబీషూవ ఫీనెహాసు కుమారుడు ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధానయాజకుడైన అహరోను కుమారుడు. 6ఈ ఎజ్రా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషేయొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. 7మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. 8రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. 9మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. 10ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను.
11యెహోవా ఆజ్ఞల వాక్యములయందును, ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడలయందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త యిచ్చిన తాకీదు నకలు 12–రాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను 13–చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమునుబట్టి యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు విమర్శచేయుటకు నీవు రాజుచేతను అతని యేడుగురు మంత్రులచేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయ మేమనగా, 14మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్లుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరు నీతోకూడ వెళ్లవచ్చును. 15మరియు యెరూషలేములో నివాసముగల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతనియొక్క మంత్రులును స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసికొని పోవలెను. 16మరియు బబులోను ప్రదేశమందంతట నీకు దొరకు వెండి బంగారములంతయును, జనులును యాజకులును యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసికొని పోవలెను. 17తడవు చేయక నీవు ఆ ద్రవ్యముచేత ఎడ్లను పొట్లేళ్లను గొఱ్ఱెపిల్లలను, వాటితోకూడ ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలనుకొని, యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము. 18మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచినదానిని చేయ వచ్చును. 19మరియు నీ దేవుని మందిరపు సేవకొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని యెదుట అప్పగింపవలెను. 20నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసినయెడల అది రాజుయొక్క ఖజానాలోనుండి నీకియ్యబడును. 21మరియు–రాజునైన అర్తహషస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ యేదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైన అడిగినయెడల ఆలస్యముకాకుండ మీరు దాని చేయవలెను. 22వెయ్యి తూముల గోధుమలు రెండువందల మణుగుల వెండి మూడువందల తూముల ద్రాక్షారసము మూడువందల తూముల నూనె లెక్కలేకుండ ఉప్పును ఇయ్యవలెను. 23ఆకాశమందలి దేవునిచేత ఏది నిర్ణయమాయెనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింప వలసినది. రాజుయొక్క రాజ్యముమీదికిని అతని కుమారులమీదికిని కోపమెందుకు రావలెను? 24మరియు యాజకులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి. 25మరియు ఎజ్రా, నది యవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానముచొప్పున నీవు నీ దేవునియొక్క ధర్మశాస్త్రవిధులను తెలిసికొనినవారిలో కొందరిని అధికారులగాను న్యాయాధిపతులగాను ఉంచవలెను, ఆ ధర్మశాస్త్రవిషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. 26నీ దేవుని ధర్మశాస్త్రముగాని, రాజుయొక్క చట్టము గాని, గైకొననివాడెవడో త్వరగా విచారణచేసి, మరణశిక్షయైనను స్వదేశత్యాగమైనను ఆస్తి జప్తియైనను ఖైదునైనను వానికి విధింపవలెను.
27యెరూషలేములోనుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులును రాజుయొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. 28నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, నాతోకూడ వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని.

Currently Selected:

ఎజ్రా 7: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in