YouVersion Logo
Search Icon

ఎజ్రా 9

9
1ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి–ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును, కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూసీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలోనుండి తమ్మును తాము వేరు పరచుకొనక, వారుచేయు అసహ్యమైన కార్యములను తామేచేయుచు, 2వారి కుమార్తెలను పెండ్లి చేసికొనుచు, తమ కుమారులకును తీసికొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనినవారైరి. ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి. 3నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, నా తల వెండ్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికి వేసికొని విభ్రాంతిపడి కూర్చుంటిని. 4చెరపట్ట బడినవారి అపరాధమును చూచి, ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నాయొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళవరకు కూర్చుంటిని. 5సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవాతట్టు చేతులెత్తి 6–నా దేవా నా దేవా, నా ముఖము నీవైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది. 7మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజులును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినముననున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతిమి. 8అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండ నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధస్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయ చూపియున్నాడు. 9నిజముగా మేము దాసులమైతిమి; అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక, పారసీకదేశపు రాజులయెదుట మాకు దయ కనుపరచి, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి, దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును, యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము#9:9 అనగా, గోడ. నిచ్చుటకును కృప చూపించితివి. 10మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్ప గలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా. 11వారు–మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అప విత్రతచేతను వారుచేయు అసహ్యమైన వాటిచేతను అపవిత్రమాయెను, వారు జరిగించిన అసహ్యమైన వాటిచేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయెను. 12కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియ్యకుడి. వారి కుమార్తెలను మీ కుమారులకొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమభాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికిని కోరకుండినయెడల, మీరు బలముగానుండి, ఆ దేశముయొక్క సుఖమును అనుభవించి, మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాని నప్పగించెదరని చెప్పిరి. 13అయితే మా దుష్క్రియలనుబట్టియు మా గొప్ప అపరాధములనుబట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి 14ఈ అసహ్యకార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనినయెడల, మేము నాశనమగువరకు శేషమైననులేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైననులేకుండునట్లును, నీవు కోపపడుదువు గదా. 15యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసితిని.

Currently Selected:

ఎజ్రా 9: TELUBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in