యెహెజ్కేలు 37
37
1యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొనిపోయి యెముకలతో నిండియున్న యొక లోయలో నన్ను దింపెను. ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా 2యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. 3ఆయన–నర పుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుక గలవా? అని నన్నడుగగా–ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని. 4అందుకాయన–ప్రవచన మెత్తి యెండిపోయిన యీ యెముకలతో ఇట్లనుము–ఎండిపోయిన యెముకలారా, యెహోవా మాట ఆలకించుడి. 5ఈ యెముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను; 6చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీమీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. 7ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని యొకటి పుట్టెను; అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. 8నేను చూచుచుండగా నరములును మాంసమును వాటిమీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేక పోయెను. 9అప్పుడు ఆయన–నరపుత్రుడా; జీవాత్మవచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా– జీవాత్మా, నలుదిక్కులనుండివచ్చి హతులైన వీరు బ్రదుకునట్లు వారిమీద ఊపిరి విడువుము. 10ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను; వారు సజీవులై లేచి లెక్కింప శక్యముకాని మహా సైన్యమై నిలిచిరి. 11అప్పుడాయన నాతో ఇట్లనెను –నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారు – మన యెముకలు ఎండి పోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతిమి అని యనుకొనుచున్నారు 12కాబట్టి ప్రవచన మెత్తి వారితో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలుదేశములోనికి తోడుకొని వచ్చెదను. 13నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా 14నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు, మీరు బ్రదుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసెదను, యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.
15మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 16–నరపుత్రుడా, నీవు కఱ్ఱతునక యొకటి తీసికొని దానిమీద యూదావారిదనియు, వారి తోటివారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్లు వ్రాయుము. మరియొక తునక తీసికొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక, అనగా యోసేపు వంశస్థులదనియు వారితోటి వారగు ఇశ్రాయేలువారిదనియు వ్రాయుము. 17అప్పు డది యేకమైన తునకయగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునక యగును. 18–ఇందులకు తాత్పర్యము మాకు తెలియజెప్పవా? అని నీ జనులు నిన్నడుగగా 19ఆ రెండు తునకలను వారి సమక్షమున నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఎఫ్రాయిము చేతిలో నున్న తునక, అనగా ఏ తునకమీద ఇశ్రాయేలువారందరి పేళ్లును వారితోటివారి పేళ్లును నేను ఉంచితినో యోసేపు అను ఆ తునకను యూదావారి తునకను నేను పట్టుకొని యొకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసెదను. 20ఇట్లుండగా వారికీలాగు చెప్పుము 21–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆయా అన్యజనులలోనుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి 22వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతములమీద 23వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనగాని తాము చేసియున్న హేయక్రియలవలనగాని యే అతి క్రమక్రియలవలనగాని వారికమీదట తమ్మును అపవిత్ర పరచుకొనరు; తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండ వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను, అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును. 24నా సేవకుడైన దావీదు వారికి రాజవును, వారికందరికి కాపరియొక్కడే యుండును, వారు నా విధులను అనుసరింతురు, నా కట్ట డలను గైకొని ఆచరింతురు. 25మీ పితరులు నివసించినట్లు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన దేశములో వారు నివసింతురు, వారి పిల్లలును వారి పిల్లల పిల్లలును అక్కడ నిత్యము నివసింతురు, నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతియై యుండును. 26నేను వారితో సమాధా నార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను. 27నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు. 28మరియు వారి మధ్య నా పరిశుద్ధస్థలము నిత్యముఉండు టనుబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలిసికొందురు.
Currently Selected:
యెహెజ్కేలు 37: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.