YouVersion Logo
Search Icon

యెహెజ్కేలు 38

38
1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైనవానితట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము 3–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–రోషునకును మెషెకు నకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను. 4నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలుదేర దీసెదను. 5నీతోకూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిర స్తాణములను ధరించు వారినందరిని నేను బయలుదేరదీసెదను. 6గోమెరును అతని సైన్యమంతయును ఉత్తరదిక్కులలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనము లనేకములు నీతోకూడ వచ్చును. 7నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహ మంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండవలెను. 8చాలదినములైన తరువాత నీవు శిక్షనొందుదువు; సంవత్సరముల అంతములో నీవు ఖడ్గమునుండి తప్పించుకొని, ఆయా జనములలో చెదరిపోయి యెడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతములమీద నివసించుటకై మరల సమకూర్చబడిన జనులయొద్దకును, ఆయా జనులలోనుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరియొద్దకును నీవు వచ్చెదవు. 9గాలి వాన వచ్చి నట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చె దవు, నీవును నీ సైన్యమును నీతోకూడిన బహు జనమును దేశముమీద వ్యాపింతురు. 10ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఆ కాలమందు నీ మనస్సులో అభి ప్రాయములు పుట్టును, 11నీవు దురాలోచనచేసి ఇట్లను కొందువు – నేను ప్రాకారములులేని గ్రామములుగల దేశముమీదికి పోయెదను, ప్రాకారములును అడ్డగడియలును గవనులునులేని దేశము మీదికి పోయెదను, నిమ్మళముగాను నిర్భయముగాను నివసించువారి మీదికి పోయెదను. 12వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై, పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలములమీదికి తిరిగి పోయెదను, ఆయా జనములలోనుండి సమకూర్చబడి, పశువులును సరకులునుగలిగి, భూమి నట్టనడుమ నివసించు జనులమీదికి తిరిగి పోయెదను. 13సెబావారును దదాను వారును తర్షీషు వర్తకులును కొదమ సింహముల వంటివారైన దానివారందరును నిన్ను చూచి–సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోపు దోచుకొనుటకు సైన్యము సమకూర్చి తివా? బహుగా దోపు దోచుకొని, వెండి బంగారములను పశువులను సరకులను పట్టుకొనిపోవుటకు చాల దోపుడు దోచుకొనుటకు వచ్చితివా? అని నిన్నడుగుదురు.
14కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా జనులగు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలిసికొందువుగదా? 15ఉత్తర దిక్కున దూరముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనము లనేకములును గుఱ్ఱములెక్కి బహువిస్తారమైన సైన్యముగా కూడి వచ్చి 16మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులగు నా జనులమీద పడెదరు; అంత్య దినములందు అది సంభవించును, అన్యజనులు నన్ను తెలిసి కొనునట్లు నిన్నుబట్టి వారి యెదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున, గోగూ, నేను నా దేశము మీదికి నిన్ను రప్పించెదను. 17ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నిన్ను వారిమీదికి రప్పించెదనని పూర్వమందు ఏటేట ప్రవచించుచువచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకులద్వారా నేను సెలవిచ్చినమాట నిన్నుగూర్చినదే గదా? 18ఆ దినమున, గోగు ఇశ్రాయేలీయుల దేశము మీదికి రాబోవు ఆ దినమున, నాకోపము బహుగా రగులుకొనును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు 19కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును గలిగినవాడనై యీలాగు ప్రమాణముచేసితిని. ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును. 20సముద్రపు చేపలును ఆకాశపక్షులును భూజంతువులును భూమిమీద ప్రాకుపురుగులన్నియు భూమిమీదనుండు నరులందరును నాకు భయపడి వణకుదురు, పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నియు నేలపడును 21నా పర్వతములన్నిటిలో అతనిమీదికి ఖడ్గము రప్పించెదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరునిమీద పడును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 22తెగులు పంపి హత్య కలుగజేసి అతనిమీదను అతని సైన్యపు వారి మీదను అతనితోకూడిన జనములనేకములమీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యెమాడుదును. 23నేను యెహోవానై యున్నానని అన్యజనులు అనేకులు తెలిసి కొనునట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి యెదుట నన్ను తెలియపరచుకొందును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in