YouVersion Logo
Search Icon

యెహెజ్కేలు 36

36
1మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వత .ములకు ఈ మాట ప్రవచింపుము–ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి, 2ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – ఆహా ప్రాచీనములైన ఉన్నతస్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరి. 3వచనమెత్తి ఈలాగు ప్రవచింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించువారిచేత జనుల దృష్టికి మీరు అపహాస్యా స్పదమగునట్లుగాను, నలుదిక్కుల మీ శత్రువులు మిమ్మును పట్టుకొన నాశించి మిమ్మును పాడుచేసియున్నారు. 4కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–శేషించిన అన్యజనులకు అపహాస్యా స్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను పాడైన స్థలములతోను నిర్జనమైన పట్టణములతోను 5ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – సంతుష్టహృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులనందరినిబట్టియు, శేషించిన అన్యజనులనుబట్టియు నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను. 6కాబట్టి ఇశ్రాయేలుదేశమునుగూర్చి ప్రవచనమెత్తి, పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ఈ మాట తెలియజెప్పుము– ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మీరు అన్యజనులవలన అవమానము నొందితిరి గనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చియున్నాను. 7ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మీ చుట్టునున్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణము చేయుచున్నాను. 8ఇశ్రాయేలు పర్వతములారా, యిక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులగు నా జనులు వచ్చె దరు, మీరు చిగురుపెట్టి వారికొరకు మీ ఫలములు ఫలించుదురు. 9నేను మీ పక్షముననున్నాను, నేను మీతట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. 10మీ మీద మానవ జాతిని, అనగా ఇశ్రాయేలీయులనందరిని, విస్తరింప జేసెదను, నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరల కట్టబడును. 11మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసెదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి,మునుపటికంటె అధికమైన మేలు మీకు కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. 12మానవజాతిని, అనగా నా జనులగు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను, వారు నిన్ను స్వతంత్రించుకొందురు, మీ రికమీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు. 13ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా–దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్నుగూర్చి చెప్పుచున్నారే. 14నీవు మనుష్యులను భక్షిం పవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు 15నిన్నుగూర్చి అన్యజనులుచేయు అపహాస్యము నీకిక వినబడకుండ చేసెదను, జనములవలన కలుగు అవమానము నీవికభరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులగా చేయకయుందువు;#36:15 కూలజేయక యుందువు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
16మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 17–నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి, దుష్‌ప్రవర్తనచేతను దుష్‌క్రియలచేతను దానిని అపవిత్రపరచిరి, వారి ప్రవర్తన బహిష్టయైన స్త్రీయొక్క అపవిత్రతవలె నా దృష్టికి కనబడుచున్నది. 18కాబట్టి దేశములో వారు చేసిన నర హత్య విషయమైయును, విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరచినదాని విషయమైయును నేను నా క్రోధమును వారిమీద కుమ్మరించి 19వారి ప్రవర్తననుబట్టియు వారి క్రియలనుబట్టియు వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయిరి. 20వారు తాము వెళ్లిన స్థలములలోని జనులయొద్ద చేరగా ఆ జనులు–వీరు యెహోవా జనులే గదా, ఆయన దేశములోనుండి వచ్చినవారే గదా, అని చెప్పుటవలన నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. 21కాగా ఇశ్రాయేలీయులు పోయిన యెల్లచోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగగా నేను చూచి నా నామము విషయమై చింతపడితిని. 22కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటనచేయుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీచేత దూషణనొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవుదానిని చేయుదును. 23అన్యజనులమధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును, వారి యెదుట మీయందు నన్ను నేను పరిశుద్ధపరచుకొనగా నేను ప్రభువగు యెహోవానని వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 24నేను అన్యజనులలోనుండి మిమ్మును తోడుకొని, ఆయా దేశములలోనుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. 25మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. 26నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. 27నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను. 28నేను మీపితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులైయుందురు నేను మీ దేవుడనై యుందును. 29మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. 30అన్యజనులలో కరవునుగూర్చిన నింద మీరిక నొందకయుండునట్లు చెట్ల ఫలములను భూమిపంటను నేను విస్తరింపజేసెదను. 31అప్పుడు మీరు మీ ద్షు ప్రవర్తనను మీరు చేసిన దుష్‌క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములనుబట్టియు హేయక్రియలనుబట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు. 32మీ నిమిత్తము నేను ఈలాగున చేయుటలేదని తెలిసి కొనుడి; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవర్తననుగూర్చి చిన్నబోయి సిగ్గు పడుడి. 33మీ దోషములవలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింప జేయునాడు పాడైపోయిన స్థలములు మరల కట్టబడును. 34మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. 35పాడైన భూమి ఏదెను వనమువలె ఆయెననియు, పాడుగాను నిర్జనముగానున్న యీ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారములుగలవాయెననియు జనులు చెప్పుదురు. 36అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టు శేషించిన అన్యజనులు తెలిసి కొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చియున్నాను, నేను దాని నెరవేర్తును.
37ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులకు నేను ఈలాగుచేయు విషయములో వారిని నాయొద్ద విచారణచేయనిత్తును, గొఱ్ఱెలు విస్తరించునట్లుగా నేను వారిని విస్తరింపజేసెదను. 38నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు ప్రతిష్ఠితములగు గొఱ్ఱెలంత విస్తారముగాను, నియామక దినములలో యెరూషలేమునకు వచ్చు గొఱ్ఱెలంత విస్తారముగాను వారి పట్టణములయందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించునట్లు నేను చేసెదను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in