YouVersion Logo
Search Icon

యెహెజ్కేలు 35

35
1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–నరపుత్రుడా, శేయీరు పర్వతమువైపు నీ ముఖము త్రిప్పుకొని 3దానికి మాట యెత్తి ఈలాగు ప్రవచింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–శేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని, నా హస్తము నీమీద చాపి నిన్ను పాడుగాను నిర్జనముగాను చేసెదను. 4నీవు నిర్జనముగాఉండునట్లు నీ పట్టణములను ఎడారులుగా చేసెదను, నీవు పాడవుదువు, అప్పుడు నేను యెహోవానై యున్నానని నీవు తెలిసికొందువు. 5ఇశ్రాయేలీయులయెడల ఎడతెగని పగకలిగి, వారి దోషసమాప్తికాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమున కప్పగించితివి గనుక 6నా జీవముతోడు నేను నిన్ను రక్తముగా చేసెదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకిష్టమాయెను గనుక రక్తమే నిన్ను తరుమును, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 7వచ్చువారును పోవువారునులేకుండ అందరిని నిర్మూలముచేసి నేను శేయీరు పర్వతమును పాడుగాను నిర్జనముగాను చేయుదును. 8అతని పర్వతములను హతమైనవారితో నింపుదును, నీ కొండలలోను నీ లోయలలోను నీ వాగులన్నిటిలోను వారు ఖడ్గముచేత హతులై కూలుదురు. 9నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు నీ పట్టణములు మరల కట్టబడకుండ ఎల్లప్పుడును పాడుగా ఉండజేయుదును. 10–యెహోవా అక్కడనుండినను ఆ రెండు జనములును ఆ రెండు దేశములును మనవే; మనము వాటిని స్వాధీనపరచుకొందము రండని నీవనుకొంటివే; 11నా జీవముతోడు నీవు వారి యెడల పట్టిన పగవలన వారికి చూపిన అసూయచొప్పునను క్రోధము చొప్పునను నేను నీకు తగిన పనిచేసి, నిన్ను శిక్షించుటవలన వారికి నన్ను నేనే తెలియపరచుకొందును. 12–అవి పాడైనవి, మనకు ఆహారముగా అప్పగింపబడినవని నీవు ఇశ్రాయేలు పర్వతములనుగురించి పలికిన దూషణమాటలన్నియు యెహోవానగు నాకు వినబడెనని నీవు తెలిసికొందువు. 13పెద్దనోరు చేసికొని మీరు నామీద విస్తారముగా ఆడిన మాటలు నాకు వినబడెను. 14ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–లోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించెదను. 15ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము పాడైపోవుట చూచి నీవు సంతోషించితివి గనుక నీకును ఆప్రకారము గానే చేసెదను; శేయీరు పర్వతమా, నీవు పాడవుదువు, ఎదోము దేశము యావత్తును పాడైపోవును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in