యెహెజ్కేలు 34
34
1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా–తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా. 3మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు, 4బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. 5కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. 6నా గొఱ్ఱెలు పర్వతములన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడుచున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు. 7కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి 8–కాపరులులేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 9కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. 10–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొఱ్ఱెలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొఱ్ఱెలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొనజాలక యుందురు; నా గొఱ్ఱెలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. 11ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును. 12తమ గొఱ్ఱెలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱెలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి 13ఆయా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. 14నేను మంచి మేతగలచోట వాటిని మేపెదను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండు కొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును, 15నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 16తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను. 17నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా– గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్యను, గొఱ్ఱెలకును పొట్టేళ్లకును మధ్యను, గొఱ్ఱెలకును మేకపోతులకునుమధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను. 18విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా? 19మీరు స్వచ్ఛమైన నీరుత్రాగి మిగిలినదానిని కాళ్లతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కినదానిని నా గొఱ్ఱెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా?
20కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఇదిగో నేను నేనే క్రొవ్విన గొఱ్ఱెలకును చిక్కిపోయిన గొఱ్ఱెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును. 21మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి, కొమ్ములతో రోగముగల వాటినన్నిటిని పొడిచి చెదర గొట్టెదరు. 22నా గొఱ్ఱెలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించెదను. 23వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. 24యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను. 25మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములోలేకుండచేయుదును. 26వారిని నా పర్వతము చుట్టుపెట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును, 27ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలోనుండి వారిని విడిపింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. 28ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరివలనను భయములేకుండ వారు సురక్షితముగా నివసించెదరు. 29మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోట యొకటి నే నేర్పరచెదను. 30అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 31నా గొఱ్ఱెలును నేను మేపుచున్న గొఱ్ఱెలునగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Currently Selected:
యెహెజ్కేలు 34: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.