యెహెజ్కేలు 29
29
1పదియవ సంవత్సరము పదియవ నెల పండ్రెండవ . దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశ మంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా 3–ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; –నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే; 4నేను నీ దవుడ లకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలులోనుండి నిన్నును నీ పొలుసు లకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను. 5నిన్నును నైలునది చేపలన్నిటిని అరణ్యములో పారబోసెదను, ఎత్తువాడును కూర్చువాడును లేక నీవు తెరపనేలమీద పడుదువు, అడవిమృగములకును ఆకాశపక్షులకును ఆహారముగా నిచ్చెదను. 6అప్పుడు నేను యెహోవానై యున్నానని ఐగుప్తీయులందరు తెలిసికొందురు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లవంటి చేతికఱ్ఱ ఆయెను; 7వారు నిన్ను చేతపట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి, వారు నీమీద ఆనుకొనగా నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవుటకు కారణమైతివి. 8కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నేను నీమీదికి ఖడ్గము రప్పించి, మనుష్యులను పశువులను నీలోనుండి నిర్మూలము చేసెదను, 9ఐగుప్తుదేశము నిర్మానుష్యమై పాడుగా ఉండును, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. –నైలునది నాది, నేనే దాని కలుగజేసితినని అతడనుకొనుచున్నాడు గనుక 10నేను నీకును నీ నదికిని విరోధినైతిని, ఐగుప్తు దేశమును మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు కూషు సరిహద్దువరకు బొత్తిగా పాడుచేసి యెడారిగా ఉంచెదను. 11దానిలో మనుష్యులు సంచరించరు, పశువులు తిరుగవు; నలువది సంవత్సరములు అది నిర్నివాసముగా ఉండును. 12నిర్మానుష్యముగానున్న దేశములమధ్యను ఐగుప్తుదేశమును పాడగునట్టుగా చేసెదను, పాడైపోయిన పట్టణములమధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును, ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్ల గొట్టుదును. 13ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నలువది సంవత్సరములు జరిగిన తరువాత ఐగుప్తీయులు చెదరిపోయిన జనులలోనుండి నేను వారిని సమకూర్చెదను. 14చెరలోనుండి వారిని తోడుకొని పత్రోసు అను వారి స్వదేశములోనికి వారిని మరల రప్పించెదను, అక్కడ వారు హీనమైన యొక రాజ్యముగా ఉందురు, 15వారికను జనములమీద అతిశయపడకుండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు; వారు ఇక రాష్టములమీద ప్రభుత్వము చేయకుండునట్లు నేను వారిని తగ్గించెదను. 16ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషము మనస్సునకు తెచ్చుకొని వారితట్టు తిరిగినయెడల ఐగుప్తీయులు ఇక వారికి ఆధారముగా ఉండరు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
17ఇరువదియేడవ సంవత్సరము మొదటినెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 18–నరపుత్రుడా, తూరు పట్టణముమీద బబులోను రాజైన నెబుకద్రెజరు తన సైన్యముచేత బహు ఆయాసకరమైన పని చేయించెను, వారందరి తలలు బోడి వాయెను, అందరి భుజములు కొట్టుకొని పోయెను; అయినను తూరుపట్టణముమీద అతడు చేసిన కష్టమునుబట్టి అతనికైనను, అతని సైన్యమునకైనను కూలి యెంత మాత్రమును దొరకకపోయెను. 19కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఐగుప్తుదేశమును బబులోను రాజైన నెబుకద్రెజరునకు నేను అప్పగించుచున్నాను, అతడు దాని ఆస్తిని పట్టుకొని దాని సొమ్మును దోచుకొని కొల్లపట్టును, అది అతని సైన్యమునకు జీతమగును. 20తూరుపట్టణముమీద అతడు చేసినది నా నిమిత్తమే చేసెను గనుక అందుకు బహుమానముగా దానిని అప్పగించుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
21ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగిరింప జేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసెదను, అప్పుడు నేను యెహోవానైయున్నానని వారు తెలిసికొందురు.
Currently Selected:
యెహెజ్కేలు 29: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.