యెహెజ్కేలు 30
30
1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–నరపుత్రుడా, సమాచార మెత్తి ప్రవచింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా–ఆహా శ్రమదినము వచ్చెనే, అంగలార్చుడి, శ్రమదినము వచ్చెనే, 3యెహోవా దినము వచ్చెను, అది దుర్దినము, అన్యజనులు శిక్షనొందు దినము. 4ఖడ్గము ఐగుప్తు దేశముమీద పడును, ఐగుప్తీయులలో హతులు కూలగా కూషుదేశస్థులు వ్యాకులపడుదురు, శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకొని దేశపు పునాదులను పడగొట్టుదురు. 5కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులందరును ఖడ్గముచేత కూలుదురు.
6యెహోవా సెలవిచ్చునదేమనగా–ఐగుప్తును ఉద్ధరించు వారు కూలుదురు, దాని బలగర్వము అణగిపోవును, మిగ్దోలు మొదలుకొని సెవేనేవరకు జనులు ఖడ్గముచేత కూలుదురు. 7పాడైపోయిన దేశములమధ్య ఐగుప్తీయులు దిక్కులేనివారుగా నుందురు, నలుదిక్కుల పాడైపోయిన పట్టణములమధ్య వారి పట్టణము లుండును. 8ఐగుప్తుదేశములో అగ్ని రగులబెట్టి నేను దానికి సహాయకులులేకుండ చేయగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. 9ఆ దినమందు దూతలు నా యెదుటనుండి బయలుదేరి ఓడలెక్కి నిర్విచారులైన కూషీయులను భయపెట్టుదురు, ఐగుప్తునకు విమర్శకలిగిన దినమున జరిగినట్టు వారికి భయభ్రాంతులు పుట్టును, అదిగో అది వచ్చే యున్నది.
10ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఐగుప్తీయులుచేయు అల్లరి బబులోను రాజైన నెబుకద్రెజరుచేత నేను మాన్పించెదను. 11జనములలో భయంకరులగు తన జనులను తోడుకొని ఆ దేశమును లయపరుచుటకు అతడు వచ్చును, ఐగుప్తీయులను చంపుటకై వారు తమ ఖడ్గములను ఒరదీసి హతమైన వారితో దేశమును నింపెదరు. 12నైలునదిని ఎండిపోజేసి నేనాదేశమును దుర్జనులకు అమ్మి వేసెదను, పరదేశులచేత నేను ఆ దేశమును దానిలోనున్న సమస్తమును పాడుచేయించెదను, యెహోవానైన నేను మాట యిచ్చియున్నాను 13యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను. 14పత్రోసును పాడుచేసెదను. సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను. 15ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మ రించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను 16ఐగుప్తుదేశములో నేను అగ్ని యుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు. 17ఓనువారిలోను పిబేసెతువారిలోను యౌవనులు ఖడ్గముచేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు. 18ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. 19నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
20పదకొండవ సంవత్సరము మొదటి నెలయేడవదినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 21–నరపుత్రుడా, నేను ఐగుప్తురాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా 22–నేను ఐగుప్తురాజైన ఫరోకు విరోధినైయున్నాను, బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి, అతనిచేతిలోనుండి ఖడ్గము జారిపడజేసెదను. 23ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆయా దేశములకు వారిని వెళ్లగొట్టుదును. 24మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతనిచేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావుదెబ్బతినినవాడై మూల్గులిడును. 25బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరోచేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తుదేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోనురాజు చేతికియ్యగా నేను యెహోవానైయున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు. 26నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆయా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.
Currently Selected:
యెహెజ్కేలు 30: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.