యెహెజ్కేలు 28
28
1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 2–నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–గర్విష్ఠుడవై–నే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రముమధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొనుచున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభి ప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలునకంటె జ్ఞానవంతుడవు, 3నీకు మర్మమైనదేదియు లేదు. 4నీ జ్ఞానముచేతను నీ వివేకముచేతను ఐశ్వర్యమునొందితివి, నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. 5నీకు కలిగిన జ్ఞానాతిశయముచేతను వర్తకముచేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి. 6కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నవాడా, ఆలకించుము; 7నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్యమును నీచపరతురు, 8నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చినవారివలెనే నీవు చత్తువు. 9–నేను దేవుడనని నిన్ను చంపువానియెదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువానిచేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా. 10సున్నతిలేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశులచేత చత్తువు, నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
11మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 12–నరపుత్రుడా, తూరు రాజునుగూర్చి అంగలార్పువచనమెత్తి ఈలాగు ప్రకటింపుము– ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–పూర్ణజ్ఞానమును సంపూర్ణసౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి 13దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్యరత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. 14అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి. 15నీవు నియమింప బడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడువరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. 16అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండకుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. 17నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను. 18నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశముమీద నిన్ను బూడిదెగా చేసెదను. 19జనులలో నిన్ను ఎరిగిన వారందరును నిన్నుగూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు.
20మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 21–నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణమువైపు త్రిప్పుకొని దానిగూర్చి యీ సమాచారము ప్రవచింపుము – ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా 22–సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీమధ్యను ఘనత నొందుదును, నేను దాని మధ్య తీర్పుతీర్చుచు దానినిబట్టి నన్ను పరిశుద్ధపరచు కొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు. 23నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును, నలుదిక్కుల దానిమీదికి వచ్చు ఖడ్గముచేత వారు హతు లగుదురు, నేను ప్రభువగు యెహోవానని 24ఇశ్రాయేలీయులు తెలిసికొనునట్లు వారి చుట్టునుండి వారిని తిరస్క రించుచు వచ్చిన వారిలో ఎవరును ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు.
25ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి, జనుల సమక్షమున వారిమధ్యను నన్ను నేను పరిశుద్ధపరచు కొందును, అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు. 26వారు అందులో నిర్భయముగా నివసించి యిండ్లు కట్టుకొని ద్రాక్షతోటలు నాటుకొందురు, వారి చుట్టు ఉండి వారిని తిరస్కరించుచు వచ్చినవారికందరికి నేను శిక్షవిధించిన తరువాత వారు నిర్భయముగా నివసించుకాలమున నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
Currently Selected:
యెహెజ్కేలు 28: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.