YouVersion Logo
Search Icon

యెహెజ్కేలు 27

27
1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 2–నరపుత్రుడా, తూరు పట్టణముగూర్చి అంగలార్పు వచనమెత్తి దానికీలాగు ప్రకటన చేయుము 3–సముద్రపురేవులమీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తకజనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – తూరు పట్టణమా–నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవను కొనుచున్నావే; 4నీ సరిహద్దులు సముద్రములమధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యముగలదానిగా చేసియున్నారు. 5నీ ఓడలను శెనీరుదేశపు సరళవృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు. 6బాషానుయొక్క సింధూరమ్రానుచేత నీ కోలలుచేయుదురు, కిత్తీయుల ద్వీపములనుండి వచ్చిన గుంజుమ్రానునకు దంతపు చెక్కడపుపని పొదిగి నీకు పీటలు చేయుదురు. 7నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములుగల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు 8తూరుపట్ట ణమా, సీదోను నివాసులును అర్వదు నివాసులును నీకు ఓడకళాసులుగా ఉన్నారు, నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞా వంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు. 9గెబలు పనివారిలో పనితెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయు వారుగా నున్నారు, సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్రప్రయాణముచేయు నావికుల యోడలన్నియు నీ రేవులలో ఉన్నవి. 10పారసీకదేశపువారును లూదు వారును పూతువారును నీ సైన్యములలోచేరి నీకు సిపా యిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను. 11అర్వదువారు నీ సైన్యములోచేరి చుట్టు నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టు నీ ప్రాకారములమీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణ పరచెదరు. 12నానా విధమైన సరకులు నీలో విస్తారముగా నున్నందున తర్షీషు వారు నీతో వర్తకముచేయుచు, వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. 13గ్రేకేయులును తుబాలువారును మెషెకువారును నీలో వర్తకవ్యాపారముచేయుచు, నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, 14తోగర్మావారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు; 15దదానువారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు, చాల ద్వీపముల వర్తకములు నీ వశమున నున్నవి; వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. 16నీచేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొను క్కొందురు. 17మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులును నీలో వర్తక వ్యాపారముచేయుచు, మిన్నీతు గోధుమలును మిఠాయిలును తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. 18దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులును కొనుక్కొందురు. 19దదానువారును గ్రేకేయులును నూలు ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. ఇనుపపనిముట్టును కత్సీయా కెనయా అను సుగంధద్రవ్యములును నీ సరకులకు బదులియ్యబడును. 20దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు. 21అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱెపిల్లలను పొట్టే ళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటి నిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు. 22షేబ వర్తకులును రామా వర్తకులును నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. 23హారానువారును కన్నేవారును ఏదెను వారును షేబ వర్తకులును అష్షూరు వర్తకులును కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు. 24వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్రవర్ణముగలవియు కుట్టుపెనితో చేయబడినవియునగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. 25తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైనదానవై మహాఘనముగా సముద్రముమీద కూర్చున్నావు. 26నీ కోలలు వేయు వారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును. 27అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తువులును నీ నావికులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలోనున్న సిపాయిలందరును నీలోనున్న జనసమూహములన్నియు నీవు కూలు దినమందే సముద్రమధ్యమందు కూలుదురు. 28నీ ఓడనాయకులు వేసిన కేకలవలన నీ ఉపగ్రామములు కంపించును; 29కోలలు పట్టుకొను వారందరును నావికులును ఓడనాయకులును తమ ఓడలమీదనుండి దిగి తీరమున నిలిచి 30నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు, తమ తలలమీద బుగ్గి పోసికొనుచు, బూడిదెలో పొర్లుచు 31నీకొరకు తలలు బోడి చేసికొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింతగలవారై నిన్నుగూర్చి బహుగా అంగలార్చుదురు. 32వారు నిన్నుగూర్చి ప్రలాపవచనమెత్తి–తూరు పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రములో మునిగి లయమై పోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? 33సముద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనములను తృప్తిపరచితివి, విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. 34ఇప్పుడు అగాధజలములలో మునిగి సముద్రబలముచేత బద్దలైతివే, నీ వర్తకమును నీ యావత్సమూహమును నీతోకూడ కూలెనే యని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. 35నిన్నుబట్టి ద్వీపనివాసులందరు విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్నబోవును. 36జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in