యెహెజ్కేలు 26
26
1మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–నరపుత్రుడా, యెరూషలేమునుగూర్చి–ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నావశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక 3ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–తూరుపట్టణమా, నేను నీకు విరోధినైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేకజనములను నీ మీదికి రప్పించెదను. 4వారు వచ్చి తూరుయొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు, నేను దానిమీదనున్న మంటిని తుడిచి వేయుదును, దానిని వట్టిబండగా చేసెదను. 5సముద్రము దాని నావరించును, అది వలలు పరచుటకు చోటగును, నేనే మాట యిచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అది జనములకు దోపుడుసొమ్మగును. 6బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు. 7ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–రారాజగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను తూరుపట్టణము మీదికి రప్పించుచున్నాను, అతడు గుఱ్ఱములతోను రథములతోను రౌతులతోను గుంపులు గుంపులుగానున్న సైన్యముతోను ఉత్తరదిక్కునుండివచ్చి 8బయటిపొలము లోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి, నీ కెదురుగా బురుజులు కట్టించి దిబ్బవేయించి నీ కెదురుగా డాలు నెత్తును. 9మరియు అతడు నీ ప్రాకారములను పడ గొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును. 10అతనికి గుఱ్ఱములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి యెగరగొట్టగా అది నిన్ను కమ్మును, బీటసందులుగల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించునప్పుడు రౌతులయొక్కయు చక్రములయొక్కయు రథములయొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును. 11అతడు తన గుఱ్ఱముల డెక్కలచేత నీ వీధులన్నియు అణగద్రొక్కించును, నీ జనులను ఖడ్గముతో హతము చేయును, నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును. 12వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహ రింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు. 13ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారానాద మికను వినబడదు, 14నిన్ను వట్టిబండగా చేయుదును, వలలు పరచుకొనుటకు చోటగుదువు నీవికను కట్టబడక యుందువు. నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
15తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా–నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతు లగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును. 16సముద్రపు అధిపతులందరును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు. 17వారు నిన్నుగూర్చి అంగలార్పు వచన మెత్తి ఈలాగున అందురు–సముద్ర నివాసమైనదానా, ఖ్యాతినొందిన పట్ణణమా, నీవెట్లు నాశనమైతివి? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్రవాసులందరిని భీతిల్లచేసినది ఇదే. 18ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్రద్వీపములు కదలుచున్నవి. 19ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నివాసులులేని పట్టణములవలెనే నేను నిన్ను పాడుచేయునప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీ వుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దానవగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగి పోవువారితోకూడ నిన్ను నివసింప జేసెదను. 20మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును; 21నిన్ను భీతికి కారణముగా జేతును, నీవు లేకపోవుదువు, ఎంత వెదకినను నీవెన్నటికిని కనబడక యుందువు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Currently Selected:
యెహెజ్కేలు 26: TELUBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.