యెహెజ్కేలు 25
25
1మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–నరపుత్రుడా, అమ్మోనీయులతట్టు ముఖము త్రిప్పుకొని వారినిగూర్చి యీ మాట ప్రవచింపుము. 3–అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నా పరిశుద్ధస్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీయుల దేశము పాడుచేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు, మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక 4నేను మిమ్మును తూర్పుననుండు మనుష్యులకు స్వాస్థ్యముగా అప్పగించెదను, వారు తమ డేరాలను మీ దేశములోవేసి మీ మధ్య కాపురముందురు, వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు. 5నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసెదను, అమ్మోనీయుల దేశమును గొఱ్ఱెల దొడ్డిగా చేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు. 6మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా– మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేలతన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు 7నేను మీకు విరోధినై, మిమ్మును జనములకు దోపుడుసొమ్ముగా అప్పగింతును, అన్యజనులలో ఉండకుండ మిమ్మును నిర్మూలము చేతును, జనము కాకుండ మిమ్మును నశింపజేతును సమూలధ్వంసము చేతును.
8మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఇతర జనములన్నిటికిని యూదావారికిని భేద మేమి యని మోయాబీయులును శేయీరు పట్టణపు వారును అందురు గనుక 9తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును; 10జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు. 11నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసి కొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును.
12మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చు కొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా 13–ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు. 14నా జనులైన ఇశ్రాయేలీయులచేత ఎదోము వారిమీద నా పగ తీర్చుకొందును, ఎదోమీయుల విషయమై నాకోపమునుబట్టియు నా రౌద్రమునుబట్టియు నేను ఆలోచించినదానిని వారు నెరవేర్చుదురు, ఎదో మీయులు నా క్రోధము తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.
15మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఫిలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశముచేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక 16ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఫిలిష్తీయులమీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలముచేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను. 17క్రోధముతో వారిని శిక్షించి వారిమీద నా పగ పూర్తిగా తీర్చుకొందును; నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
Currently Selected:
యెహెజ్కేలు 25: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.