YouVersion Logo
Search Icon

యెహెజ్కేలు 24

24
1తొమ్మిదియవ సంవత్సరము పదియవ నెల పదియవదినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 2–నరపుత్రుడా, ఈదినము పేరు వ్రాసి యుంచుము, నేటిదినము పేరు వ్రాసి యుంచుము, ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు. 3మరియు తిరుగుబాటుచేయు ఈ జనులనుగూర్చి యుపమానరీతిగా ఇట్లు ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యిమీద పెట్టుము. 4తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నియు చేర్చి అందులో వేసి, మంచి యెముకలను ఏరి దాని నింపుము. 5మందలో శ్రేష్ఠమైనవాటిని తీసికొనుము, అందున్న యెముకలు ఉడుకునట్లు చాల కట్టెలు పోగుచేయుము, దానిని బాగుగా పొంగించుము, ఎముకలను చాలునంతగా ఉడికించుము.
6కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నరహంతకులున్న పట్టణమునకు శ్రమ; మడ్డిగలకుండా, మానకుండ మడ్డిగలిగియుండుకుండా, నీకు శ్రమ; చీటి దాని వంతున పడలేదు, వండినదానిని ముక్కవెంబడి ముక్కగా దానిలోనుండి తీసికొని రమ్ము. 7దానిచేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది, మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేలమీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను. 8కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండ నిచ్చితిని. 9ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా –నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను. 10చాల కట్టెలు పేర్చుము, అగ్ని రాజబెట్టుము, మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమియు ఉండకుండ ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము. 11తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడియై మెరుగు పట్టువరకు వట్టిచట్టి పొయ్యిమీదనే యుంచుము. 12అలసట పుట్టువరకు ఇంతగా శ్రద్ధపుచ్చుకొనినను దాని విస్తారమైన మష్టు పోదాయెను, మష్టుతోకూడ దానిని అగ్నిలో వేయుము, 13నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే; నిన్ను శుభ్ర పరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్ర పడకయుందువు. 14యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను నేను వెనుకతీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తననుబట్టియు నీ క్రియలనుబట్టియు నీకు శిక్ష విధింపబడును, ఇదే యెహోవా వాక్కు.
15మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను 16–నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్దనుండి ఒక్కదెబ్బతో తీసివేయ బోవుచున్నాను, నీవు అంగలార్చవద్దు ఏడువవద్దు కన్నీరు విడువవద్దు. 17మృతులకై విలాపముచేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను, నీ పెదవులు మూసికొన వద్దు జనుల ఆహారము భుజింపవద్దు 18ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంతనమున నా భార్య చనిపోగా ఆయన నా కాజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని. 19–నీవు చేసినవాటివలన మేము తెలిసికొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగగా 20నేను వారితో ఇట్లంటిని– యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. 21–ఇశ్రాయేలీయులకు నీవీలాగున ప్రకటిం పుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా– మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చటగాను, మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులును కుమార్తెలును అక్కడనే ఖడ్గముచేత కూలుదురు. 22అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసికొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు. 23మీ శిరో భూషణములను తలలమీదనుండి తీయకయు, మీ పాద రక్షలను పాదములనుండి తీయకయు, అంగలార్చకయు, ఏడ్వకయు నుందురు, ఒకని నొకరుచూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములనుబట్టి మీరు క్షీణించి పోవుదురు. 24యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు, ఇది సంభవించునప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
25నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నుల కింపైనదానిని వారు ఇచ్ఛయించు దానిని, వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమునందు నీకు సమాచారము తెలియజేయుటకై తప్పించుకొని వచ్చిన యొకడు నీయొద్దకు వచ్చును. 26-27ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక, తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాటలాడుదువు; నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in