నిర్గమకాండము 21
21
1నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా 2–నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడలవాడు ఆరుసంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. 3వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండినయెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును. 4వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనినయెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకానివాడు ఒంటిగానే పోవలెను. 5అయితే ఆ దాసుడు–నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పినయెడల 6వాని యజమానుడు దేవుని#21:6 లేక, న్యాయాధిపతి. యొద్దకు వానిని తీసికొని రావలెను, మరియువాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాతవాడు నిరంతరము వానికి దాసుడైయుండును.
7ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపోకూడదు. 8దానిని ప్రధానము చేసికొనిన#21:8 చేసికొనని. యజమానుని దృష్టికి అది యిష్టురాలు కానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారములేదు. 9తన కుమారునికి దాని ప్రధానము చేసినయెడల కుమార్తెల విషయమైన న్యాయవిధినిబట్టి దానియెడల జరిగింపవలెను. 10ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను, మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసారధర్మమును తక్కువ చేయకూడదు. 11ఈ మూడును దానికి కలుగజేయని యెడల అది ఏమియు ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును.
12నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను. 13అయితేవాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగినయెడలవాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.
14అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడలవాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.
15తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనొందును.
16ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తనయొద్ద నుంచుకొనినను,వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
17తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.
18మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుటవలనవాడు చావక మంచముమీద పడియుండి 19తరువాత లేచి తన చేతికఱ్ఱతో బయటికి వెళ్లి తిరుగుచుండినయెడల, వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదుగాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చివాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలెను.
20ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతి దండన నొందును. 21అయితేవాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతి దండన అతడు పొందడు,వాడు అతని సొమ్మేగదా. 22నరులు పోట్లాడుచుండగా గర్భవతియైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రానియెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను. 23-24హాని కలిగినయెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, 25వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.
26ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినయెడల ఆ కంటి హానినిబట్టి వారిని స్వతంత్రు నిగా పోనియ్యవలెను. 27వాడు తన దాసుని పల్లయినను తన దాసి పల్లయినను ఊడగొట్టినయెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనియ్యవలెను.
28ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ యెద్దు యజమానుడు నిర్దోషియగును. 29ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను,వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను. 30వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. 31అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను. 32ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచినయెడల వారి యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్టవలెను.
33ఒకడు గోతిమీది కప్పు తీయుటవలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుటవలన, దానిలో ఎద్దయినను గాడిదయైనను పడినయెడల 34ఆ గోతి ఖామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను; వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను; చచ్చినది వానిదగును.
35ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన యెద్దును పంచుకొనవలెను. 36అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతేవాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను; చచ్చినది వానిదగును.
Currently Selected:
నిర్గమకాండము 21: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.