YouVersion Logo
Search Icon

నిర్గమకాండము 20

20
1దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను. 2–నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; 3నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
4పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను#20:4 చెక్కినవిగ్రహము. నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. 5ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు 6నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను.
7నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.
8విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. 9ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను 10ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయకూడదు. 11ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవదినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
12నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
13నరహత్య చేయకూడదు.
14వ్యభిచరింపకూడదు.
15దొంగిలకూడదు.
16నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.
17నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.
నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.
18ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి 19–నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడినయెడల మేము చనిపోవుదుము 20అందుకు మోషే–భయపడకుడి; మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలు గుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.
21ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా 22యెహోవా మోషేతో ఇట్లనెను – ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము–నేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి. 23మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసికొనకూడదు. 24మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహనబలులను సమాధానబలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. 25నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు; దానికి నీ పనిముట్టు తగలనిచ్చినయెడల అది అపవిత్రమగును. 26మరియు నా బలిపీఠముమీద నీ దిగంబరత్వము కనబడక యుండునట్లు మెట్లమీదుగా దానిని ఎక్కకూడదు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in