YouVersion Logo
Search Icon

నిర్గమకాండము 19

19
1ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలుదేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. 2వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. 3మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి–నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా 4–నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి. 5కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. 6సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా 7మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను. 8అందుకు ప్రజలందరు–యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. 9యెహోవా మోషేతో–ఇదిగో నేను నీతో మాటలాడు నప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మక ముంచునట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా 10యెహోవా మోషేతో–నీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని 11మూడవనాటికి సిద్ధముగా నుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును. 12నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచి–మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. 13ఎవడును చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను, మనుష్యుడుగాని మృగముగాని బ్రదుకకూడదు, బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతముయొద్దకు రావలెననెను. 14అప్పుడు మోషే పర్వతముమీదనుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. 15అప్పుడతడు–మూడవనాటికి సిద్ధముగా నుండుడి; ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 16మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూరయొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి. 17దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. 18యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. 19ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. 20యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను 21అప్పుడు యెహోవా–ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. 22మరియు యెహోవావారిమీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా 23మోషే యెహోవాతో– ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు–పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. 24అందుకు యెహోవా–నీవు దిగి వెళ్లుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవావారిమీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు; ఆయన వారిమీద పడునేమో అని అతనితో చెప్పగా 25మోషే ప్రజలయొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in