YouVersion Logo
Search Icon

నిర్గమకాండము 22

22
1ఒకడు ఎద్దునైనను గొఱ్ఱెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా అయిదు ఎద్దులను ఆ గొఱ్ఱెకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెలను ఇయ్యవలెను. 2దొంగ కన్నము వేయుచుండగావాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధ ముండదు. 3సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినయెడల వానికి రక్తాపరాధముండును;వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమియు లేకపోయినయెడలవాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. 4వాడు దొంగిలినది ఎద్దయినను గాడిదయైనను గొఱ్ఱెయైనను సరే అది ప్రాణముతో వానియొద్ద దొరికినయెడల రెండం తలు చెల్లింపవలెను.
5ఒకడు చేనునైనను ద్రాక్షతోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినయెడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నియ్యవలెను.
6అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుటవలన పంట కుప్పయైనను పంటపైరైనను చేనైనను కాలి పోయినయెడల అగ్ని నంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. 7ఒకడు సొమ్మయినను సామానైనను జాగ్రత్తపెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని యింటనుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికినయెడలవాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను; 8ఆ దొంగ దొరకని యెడల ఆ యింటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసికొనెనో లేదో పరిష్కారమగుటకై దేవునియొద్దకు రావలెను. 9ప్రతి విధమైన ద్రోహమునుగూర్చి, అనగా ఎద్దునుగూర్చి గాడిదనుగూర్చి గొఱ్ఱెనుగూర్చి బట్టనుగూర్చి పోయినదాని నొకడు చూచి యిది నాదని చెప్పిన దానిగూర్చి ఆ యిద్దరి వ్యాజ్యెము దేవుని యొద్దకు#22:9 లేక, న్యాయాధిపతులయొద్దకు. తేబడవలెను. దేవుడు#22:9 లేక, న్యాయాధిపతి. ఎవనిమీద నేరము స్థాపించునోవాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను.
10ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొఱ్ఱెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించినమీదట, అది చచ్చినను హాని పొందినను, ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను, 11వాడు తన పొరుగువాని సొమ్మును తీసికొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరిమధ్యనుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను; ఆ నష్టమును అచ్చు కొననక్కరలేదు. 12అది నిజముగా వానియొద్దనుండి దొంగిలబడినయెడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చు కొనవలెను. 13అది నిజముగా చీల్చబడినయెడలవాడు సాక్ష్యముకొరకు దాని తేవలెను; చీల్చబడినదాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు.
14ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసి కొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు, అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. 15దాని యజమానుడు దానితో నుండినయెడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైనయెడల అది దాని అద్దెకు వచ్చెను. 16ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో శయనించినయెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను. 17ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడలవాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను.
18శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.
19మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను. 20యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు. 21పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గదా. 22విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు. 23వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱపెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును. 24నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవ రాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కు లేనివారగుదురు.
25నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింపకూడదు, వానికి వడ్డికట్టకూడదు. 26నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్పగించుము. 27వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహమునకు వస్త్రము;వాడు మరి ఏమి కప్పుకొని పండు కొనును? నేను దయగలవాడను,వాడు నాకు మొఱపెట్టినయెడల నేను విందును.
28నీవు దేవుని#22:28 లేక, న్యాయాధిపతిని. నిందింపగూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు.
29నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవుచేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. 30అట్లే నీ యెద్దులను నీ గొఱ్ఱెలను అర్పింపవలెను. ఏడు దినములు అది దాని తల్లియొద్ద ఉండవలెను. ఎనిమిదవదినమున దానిని నాకియ్యవలెను.
31మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in