నిర్గమకాండము 15
15
1అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి–
యెహోవానుగూర్చి గానముచేసెదను
ఆయన మిగుల అతిశయించి జయించెను
గుఱ్ఱమును దాని రౌతును
ఆయన సముద్రములో పడద్రోసెను.
2యెహోవాయే నా బలము నా గానము
ఆయన నాకు రక్షణయు ఆయెను.
ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను
ఆయన నా పితరుల దేవుడు
ఆయన మహిమ నుతించెదను.
3యెహోవా యుద్ధశూరుడు
యెహోవా అని ఆయనకు పేరు.
4ఆయన ఫరో రథములను అతని సేనను
సముద్రములో పడద్రోసెను
అతని అధిపతులలో శ్రేష్ఠులు
ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి
5అగాధజలములు వారిని కప్పెనువారు రాతివలె అడుగంటిపోయిరి.
6యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును
యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితక గొట్టును.
7నీ మీదికి లేచువారిని
నీ మహిమాతిశయమువలన అణచివేయుదువు
నీ కోపాగ్నిని రగులజేయుదువు
అది వారిని చెత్తవలె దహించును.
8నీ నాసికారంధ్రముల ఊపిరివలన
నీళ్లు రాశిగా కూర్చబడెను
ప్రవాహములు కుప్పగా నిలిచెను
అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను
9–తరిమెదను కలిసికొనియెదను
దోపుడుసొమ్ము పంచుకొనియెదను
వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను
నా కత్తి దూసెదను
నా చెయ్యి వారిని నాశనము చేయునని
శత్రువనుకొనెను.
10నీవు నీ గాలిని విసరజేసితివి
సముద్రము వారిని కప్పెనువారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె
మునిగిరి.
11యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు
పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు
స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు
అద్భుతములు చేయువాడవు
నీవంటివాడెవడు
12నీ దక్షిణహస్తమును చాపితివి
భూమి వారిని మ్రింగివేసెను.
13నీవు విమోచించిన యీ ప్రజలను
నీ కృపచేత తోడుకొనిపోతివి
నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడి పించితివి.
14జనములు విని దిగులుపడును
ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును.
15ఎదోము నాయకులు కలవరపడుదురు
మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును
కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు.
భయము అధికభయము వారికి కలుగును.
16యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు
నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు
నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.
17నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు
యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద
నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను
18నీచేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందువారిని నిలువ పెట్టెదవు.
యెహోవా నిరంతరమును ఏలువాడు.
19ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవావారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిరి.
20మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా 21మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను–
యెహోవాను గానము చేయుడి
ఆయన మిగుల అతిశయించి జయించెను
గుఱ్ఱమును దాని రౌతును
సముద్రములో ఆయన పడద్రోసెను.
22మోషే ఎఱ్ఱసముద్రమునుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడుదినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. 23మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా#15:23 అనగా, చేదు. అను పేరు కలిగెను. 24ప్రజలు–మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా 25అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి, 26–మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. 27తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి.
Currently Selected:
నిర్గమకాండము 15: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.