నిర్గమకాండము 16
16
1తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిన రెండవనెల పదునైదవదినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. 2ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజ మంతయు మోషే అహరోనులమీద సణిగెను. 3ఇశ్రాయేలీయులు–మేము మాంసము వండుకొనుకుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతిమి? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా 4యెహోవా మోషేను చూచి–ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. 5మరియు ఆరవదినమునవారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను. 6అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో–యెహోవా ఐగుప్తు దేశములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును. 7యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి. 8మరియు మోషే –మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహో వాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను 9అంతట మోషే అహరోనుతో–యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను. 10అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. 11అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను– నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని 12నీవు–సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను. 13కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెముచుట్టు పడియుండెను. 14పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను. 15ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక–ఇదేమి#16:15 హెబ్రీ భాషలో మన్నా. అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. 16మోషే–ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా–ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములోనున్నవారికొరకు కూర్చుకొనవలెననెను. 17ఇశ్రాయేలీయులు అట్లుచేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. 18వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమతమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి. 19మరియు మోషే–దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను. 20అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయమువరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపెట్టి కంపుకొట్టెను. మోషే వారిమీద కోపపడగా 21వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. 22ఆరవదినమునవారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి. 23అందుకు అతడు–యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండు కొనుడి, ఉదయమువరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను. 24మోషే ఆజ్ఞాపించి నట్లువారు ఉదయమువరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. 25మోషే–నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు. 26ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతిదినమున అనగా ఏడవదినమున అది దొరకదనెను. 27అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవదినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకక పోయెను. 28అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను–మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు? 29చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవదినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవదినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను. 30కాబట్టి యేడవదినమున ప్రజలు విశ్రమించిరి. 31ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను. 32మరియు మోషే ఇట్లనెను–యెహోవా ఆజ్ఞాపించినదేమనగా–నేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను. 33కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను. 34యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను. 35ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తినుచుండిరి; వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి. 36ఓమెరు అనగా ఏపాలో#16:36 ఏపా ఇంచుమించు రెండు శేరులనర కావచ్చును. దశమ భాగము.
Currently Selected:
నిర్గమకాండము 16: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.