నిర్గమకాండము 14
14
1మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను 2–ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. 3ఫరో ఇశ్రాయేలీయులనుగూర్చి–వారు ఈ దేశములో చిక్కు బడి యున్నారు; అరణ్యము వారిని మూసి వేసెనని అను కొనును. 4అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను; అతడు వారిని తరుమగా; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయులందరు తెలిసికొందురనెను. వారు ఆలాగు దిగిరి. 5ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి –మనమెందుకీలాగు చేసితిమి? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పు కొనిరి. 6అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొని పోయెను. 7మరియు అతడు శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడుకొనిపోయెను. 8యెహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లుచుండిరి. 9ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱములన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి. 10ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి. 11అంతట వారు మోషేతో–ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల? 12మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటె ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. 13అందుకు మోషే–భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ జేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. 14యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.
15అంతలో యెహోవా మోషేతో–నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? –సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. 16నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు. 17ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చు కొందును. 18నేను ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను. 19అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను. 20అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. 21మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొల గించి దానిని ఆరిన నేలగా చేసెను. 22నీళ్లు విభజింప బడగా ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను. 23ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. 24అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి 25వారి రథచక్రములు ఊడిపడునట్లుచేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు –ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవావారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.
26అంతలో యెహోవా మోషేతో–ఐగుప్తీయులమీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను. 27మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను. 28నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు. 29అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను. 30ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రతీరమున చూచిరి. 31యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.
Currently Selected:
నిర్గమకాండము 14: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.