2 సమూయేలు 20
20
1బెన్యామీనీయుడగు బిక్రి కుమారుడైన షెబయను పనికిమాలినవాడొకడు అచ్చటనుండెను. వాడు–దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారునియందు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రమును లేదు; ఇశ్రాయేలువారలారా, మీరందరు మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటనచేయగా 2ఇశ్రాయేలువారందరు దావీదును విడిచి బిక్రి కుమారుడైన షెబనువెంబడించిరి. అయితే యొర్దాను నదినుండి యెరూషలేమువరకు యూదావారు రాజును హత్తుకొనిరి. 3దావీదు యెరూషలేము లోని తన నగరికి వచ్చి, తన యింటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన పదిమంది స్త్రీలను తీసికొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెనుగాని వారియొద్దకు పోకుండెను; వారు కావలియందుంచబడిన వారై బ్రతికినంతకాలము విధవరాండ్రవలె ఉండిరి.
4తరువాత రాజు అమాశాను పిలువనంపి–మూడుదినములలోగా నీవు నా దగ్గరకు యూదావారినందరిని సమ కూర్చి యిక్కడ హాజరుకమ్మని ఆజ్ఞాపించగా 5అమాశా యూదా వారిని సమకూర్చుటకై వెళ్లిపోయెను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరి పోయినప్పుడు 6దావీదు అబీషైని పిలువనంపి–బిక్రి కుమారుడైన షెబ అబ్షాలోముకంటె మనకు ఎక్కువ కీడుచేయును; వాడు ప్రాకారములుగల పట్టణములలో చొచ్చి మనకు దొరకక పోవునేమో గనుక నీవు నీ యేలినవాని సేవకులను వెంట బెట్టుకొనిపోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను. 7కాబట్టి యోవాబు వారును కెరేతీయులును పెలేతీయులును బలాఢ్యులందరును అతనితోకూడ యెరూషలేములోనుండి బయలుదేరి బిక్రి కుమారుడగు షెబను తరుమబోయిరి. 8వారు గిబియోనులో ఉన్న పెద్ద బండదగ్గరకు రాగా అమాశా వారిని కలియ వచ్చెను; యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించియున్న నడికట్టుకు వరగల కత్తికట్టుకొనియుండగా ఆ వర వదులై కత్తి నేలపడెను. 9అప్పుడు యోవాబు అమాశాతో–నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు, అమాశాను ముద్దుపెట్టుకొనునట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకొని 10అమాశా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడు కొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను; గుచ్చినతోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబును అతని సహోదరుడగు అబీషైయును బిక్రి కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా 11యోవాబు బంటులలో ఒకడు అతనిదగ్గర నిలిచి–యోవాబుకు ఇష్టులైన దావీదు పక్షముననున్నవారందరు యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను. 12అమాశా రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా అచ్చోటికి వచ్చిన జనులందరు నిలిచి యుండుట ఆ మనుష్యుడు చూచి–అమాశాను మార్గము నుండి చేనిలోనికి లాగి, మార్గస్థులందరు నిలిచి తేరిచూడకుండ శవముమీద బట్ట కప్పెను. 13శవము మార్గమునుండి తీయబడిన తరువాత జనులందరు బిక్రి కుమారుడగు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్లిరి. 14అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరియొద్దకును ఆబేలువారియొద్దకును బేత్మయకావారియొద్దకును బెరీయులందరియొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి. 15ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకాయందు బిక్రిని ముట్టడివేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరు ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. 16అప్పుడు యుక్తిగల యొక స్త్రీ ప్రాకారము ఎక్కి–ఓహో ఆలకించుడి, ఆలకించుడి, నేను అతనితో మాటలాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమెదగ్గరకు వచ్చెను. 17అంతట ఆమె–యోవాబువు నీవేనా అని అతని నడుగగా అతడు–నేనే అనెను. అందుకామె– నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగగా అతడు–మాటలాడ వచ్చుననెను. 18అంతట ఆమె–పూర్వకాలమున జనులు–ఆబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుట కద్దు; ఆలాగున చేసి కార్యములు ముగించుచు వచ్చిరి. 19నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్థులలోను యథార్థవంతులలోను చేరికయైనదానను; ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు; యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదు వని చెప్పగా 20యోవాబు–నిర్మూలము చేయను, లయపరచను, ఆలాగున చేయనే చేయను, సంగతి అది కానే కాదు. 21బిక్రి కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదుమీద ద్రోహము చేసియున్నాడు; మీరు వానిని మాత్రము అప్పగించుడి; తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో–చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పిపోయి 22తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికి తెలియ జేయగా, వారు బిక్రి కుమారుడగు షెబయొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరును ఆ పట్టణమును విడిచి యెవరి గుడారములకు వారు పోయిరి; యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను.
23యోవాబు ఇశ్రాయేలు దండువారందరికి అధిపతియైయుండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతియైయుండెను. 24అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియైయుండెను; అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖకుడు; సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు#20:24 యాజకుడు..
Currently Selected:
2 సమూయేలు 20: TELUBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.