YouVersion Logo
Search Icon

2 సమూయేలు 21

21
1దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండ కరవుకలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను–సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనినిబట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను. 2గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించినవారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరిగాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారియందు ఆసక్తిగలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. 3రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి–నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా 4గిబియోనీయులు–సౌలు అతని యింటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులేగాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనను చంపుటయేగాని మేము కోరుట లేదనిరి. అంతట దావీదు మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదు ననగా 5వారు–మాకు శత్రువులై మమ్మును నాశనముచేయుచు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండ మేము లయమగునట్లు మాకు హానిచేయనుద్దేశించినవాని కుమారులలో ఏడుగురిని మాకప్పగించుము. 6యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవిచేయగా రాజు–నేను వారిని అప్పగించెదననెను. 7తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసియున్న హేతువుచేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషె తును అప్పగింపక 8అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన యిద్దరు కుమారులగు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబు#21:8 హెబ్రీభాషలో–మీకాలు. మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలునకు కనిన అయిదుగురు కుమారులను పట్టుకొని గిబియోనీయుల కప్పగించెను. 9వారు ఈ యేడుగురిని తీసికొనిపోయి కొండమీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ యేడుగురు ఏకరీతినే చంపబడిరి; కోతకాలమున యవలకోత యారంభమందువారు మరణమైరి. 10అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసికొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశమునుండి వర్షము ఆ కళేబరములమీద కురియువరకు అచ్చటనేయుండి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండను రాత్రి అడవిమృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా 11అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను. 12కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారియొద్దనుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబే ష్గిలాదువారు వారి యెముకలను అచ్చటనుండి దొంగిలి తెచ్చి యుండిరి. 13కావున దావీదు వారియొద్దనుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను, రాజాజ్ఞనుబట్టి ఉరితీయబడినవారి యెముకలను జనులు సమకూర్చిరి. 14సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తరువాత దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడంగీకరించెను.
15ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరల జరుగగా దావీదు తన సేవకులతోకూడ దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మ సిల్లెను. 16అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బి బేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలది–నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. 17సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిచూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇకమీదట మాతోకూడ యుద్ధమునకు రావద్దని అతనిచేత ప్రమాణము చేయించిరి.
18అటుతరువాత ఫిలిష్తీయులతో గోబుదగ్గర మరల యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సఫును చంపెను. 19తరువాత గోబుదగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను; వాని యీటెకఱ్ఱ నేతగాని దోనె అంత గొప్పది. 20ఇంకొక యుద్ధము గాతుదగ్గర జరిగెను. అక్కడ మంచి యెత్తరి యొకడుండెను, ఒక్కొక చేతికి ఆరేసి వ్రేళ్లును, ఇరువది నాలుగు వ్రేళ్లు అతనికుండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు. 21అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను. 22ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై దావీదువలనను అతని సేవకులవలనను హతులైరి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in