2 సమూయేలు 19
19
1రాజు తన కుమారునిగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరు విని, 2-5యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనులవలె వారు నాడు దొంగనడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి; నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని–అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా నా కుమారుడా, అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమునుగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరియందున్న రాజునొద్దకు వచ్చి–నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరిని నేడు సిగ్గుపరచి 6నీ స్నేహితుల యెడల ప్రేమ చూపక నీ శత్రువులయెడల ప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులును సేవకులును నీకు ఇష్టజనులుకారని నీవు కనుపరచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రదికియుండినయెడల అది నీకు ఇష్టమగునన్న మాట యీ దినమున నేను తెలిసికొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. 7నీవు బయటికి రాకయుండినయెడల ఈ రాత్రి యొకడును నీయొద్ద నిలువడని యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను; నీ బాల్యమునుండి నేటివరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటె అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవిచేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను.
8రాజు గుమ్మములో కూర్చున్నాడను మాట జనులందరు విని రాజును దర్శింప వచ్చిరిగాని ఇశ్రాయేలువారు తమతమ యిండ్లకు పారిపోయిరి. 9అంతట ఇశ్రాయేలువారి గోత్రములకు చేరికైన జనులందరు ఇట్లనుకొనిరి–మన శత్రువుల చేతిలోనుండియు, ఫిలిష్తీయుల చేతిలోనుండియు మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములోనుండి పారిపోయెను. 10మనమీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరల తోడుకొని వచ్చుటనుగూర్చి ఏల మాట్లాడక పోతిమి?
11రాజైన దావీదు ఇది విని యాజకులగు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి–ఇశ్రాయేలువారందరు మాటలాడుకొను సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరల తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు? 12మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై యుండగా రాజును తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను. 13మరియు అమాశా యొద్దకు దూతలను పంపి–నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్పఅపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను. 14అతడు పోయి యెవరును తప్పకుండ యూదావారినందరిని రాజునకు ఇష్టపూర్వకముగా లోబడునట్లు చేయగా–నీవును నీ సేవకులందరును మరల రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నదియొద్దకు రాగా 15యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యివతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి.
16అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితోకూడ వచ్చెను. 17అతని యొద్ద వెయ్యిమంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని పదు నయిదుగురు కుమారులును అతని యిరువదిమంది దాసులును వచ్చి 18రాజు ఎదుట నది దాటిరి; రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవుపడవను ఇవతలకు తెచ్చి యుండిరి. అంతట గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యొర్దానునది దాటి రాగానే అతనికి సాష్టాంగపడి 19–నా యేలినవాడా, నేను చేసిన ద్రోహము నామీద మోప కుము; నా యేలినవాడవును రాజవునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచు కొనకుము. 20నేను పాపము చేసితినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితోకూడ నా యేలినవాడవును రాజవునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చియున్నాననెను. 21అంతట సెరూయా కుమారుడగు అబీషై–యెహోవా అభిషేకించినవానిని శపించిన యీ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని యనగా 22దావీదు–సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలువారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? యిప్పుడు నేను ఇశ్రాయేలువారిమీద రాజు నైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణముచేసి 23–నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను.
24మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటివరకు అతడు కాళ్లు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను. 25రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు –మెఫీబోషెతూ, నీవు నాతోకూడ రాకపోతివేమని అతని నడిగెను 26అందుకతడు–నా యేలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిదమీద గంత కట్టించి యెక్కి రాజుతోకూడ వెళ్లిపోదునని నేనను కొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. 27సీబా నీ దాసుడనైన నన్నుగూర్చి నా యేలినవాడవును రాజవునగు నీతో అబద్ధమాడెను. అయితే నా యేలినవాడవును రాజవునగు నీవు దేవదూత వంటివాడవు, నీ దృష్టికి ఏది యనుకూలమో దాని చేయుము. 28నా తండ్రి యింటి వారందరు నా యేలినవాడవును రాజవునగు నీ దృష్టికి మృతుల వంటివారై యుండగా, నీవు నీ బల్లయొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజవైన నీకు మొఱ్ఱపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా 29రాజు–నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేనాజ్ఞ ఇచ్చితిని గదా అనెను. 30అందుకు మెఫీబోషెతు–నా యేలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చియున్నావు గనుక అతడు అంతయు తీసికొన వచ్చుననెను.
31మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీమునుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతోకూడ నది దాటెను. 32బర్జిల్లయియెనుబది సంవత్సరముల వయస్సుకలిగి బహు ముసలివాడై యుండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చెను. 33యెరూషలేములో నాయొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతోకూడ నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవియ్యగా 34బర్జిల్లయి–రాజవగు నీతోకూడ యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును? 35నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకులయొక్కయు గాయకురాండ్రయొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా యేలిన వాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను? 36నీ దాసుడనైన నేను నీతోకూడ నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చెదనుగాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేల? 37నేను నా ఊరియందుండి మరణమై నా తలిదండ్రుల సమాధియందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము, నీ దాసుడగు కింహాము నా యేలిన వాడవును రాజవునగు నీతోకూడ వచ్చుటకు సెలవిమ్ము; నీ దృష్టికి ఏది యనుకూలమో దానిని అతనికి చేయుమని మనవిచేయగా 38రాజు–కింహాము నాతోకూడ రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసెదను, మరియు నావలన నీవు కోరునదంతయు నేను చేసెదనని సెలవిచ్చెను. 39జనులందరును రాజును నది యవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దుపెట్టుకొని దీవించెను; తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్లిపోయెను.
40యూదా వారందరును ఇశ్రాయేలువారిలో సగము మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చెను. 41ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరును రాజునొద్దకు వచ్చి–మా సహోదరులగు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని, నీ యింటివారిని నీవారిని యొర్దాను ఇవతలకు తోడుకొని వచ్చిరని యడుగగా 42యూదా వారందరు–రాజు మీకు సమీపబంధువుడై యున్నాడు గదా, మీకు కోప మెందుకు? ఆలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు యినాము ఏమైన ఇచ్చెనా? అని ఇశ్రాయేలువారితో అనిరి. 43అందుకు ఇశ్రాయేలు వారు–రాజులో మాకు పది భాగములున్నవి; మీకంటె మేము దావీదునందు అధిక స్వాతంత్యము గలవారము; రాజును తోడుకొని వచ్చుటనుగురించి మీతో ముందుగా మాటలాడినవారము మేమే గదా మీరు మమ్మును నిర్లక్ష్యము చేసితిరేమి? అని యూదా వారితో పలికిరి. యూదావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటలకంటె కఠినముగా ఉండెను.
Currently Selected:
2 సమూయేలు 19: TELUBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.