2 సమూయేలు 18
18
1దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి 2జనులను మూడు భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును సెరూయా కుమారుడగు అబీషై అను యోవాబు సహోదరుని చేతిక్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతిక్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు–నేను మీతోకూడ బయలుదేరుదునని జనులతో చెప్పగా 3జనులు–నీవు రాకూడదు, మేము పారిపోయి నను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మావంటి పది వేలమందితో నీవు సాటి; కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెనని అతనితో చెప్పిరి. 4అందుకు రాజు–మీ దృష్టికేది మంచిదో దాని చేసెదనని చెప్పి గుమ్మపు ప్రక్కను నిలిచి యుండగా జనులందరును గుంపులై వందల కొలదిగాను వేల కొలదిగాను బయలుదేరిరి. 5అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి–నా నిమిత్తమై యౌవనుడైన అబ్షాలోమునకు దయ జూపుడని ఆజ్ఞాపించెను. జనులందరు వినుచుండగా రాజు అబ్షాలోమునుగూర్చి అధిపతులకందరికి ఆజ్ఞ ఇచ్చెను. 6జనులు ఇశ్రాయేలువారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగగా 7ఇశ్రాయేలువారు దావీదు సేవకుల యెదుట నిలువలేక ఓడిపోయిరి; ఆ దినమున ఇరువది వేలమంది అక్కడ హతులైరి. 8యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను; మరియు నాటి దినమున కత్తిచేత కూలినవారి కంటె ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. 9అబ్షాలోము కంచరగాడిదమీద ఎక్కి పోవుచు దావీదు సేవకులకు ఎదురాయెను; ఆ కంచరగాడిద యొక గొప్పమస్తకి వృక్షముయొక్క చిక్కుకొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికినిమధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను. 10ఒకడు దానిని చూచి వచ్చి–అబ్షాలోము మస్తకివృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు 11యోవాబు–నీవు చూచి యుంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపినయెడల పది తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చియుందు నని తనకు సమాచారము చెప్పినవానితో అనెను. 12అందుకు వాడు–యౌవనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండ జాగ్రత్తపడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ నిచ్చుచుండగా నేను వింటిని; వెయ్యితులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను. 13మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చినయెడల అది రాజునకు తెలియకపోదు, రాజు సన్నిధిని నీవే నాకు విరోధివగుదువు గదా అని యోవాబుతో అనగా 14యోవాబు–నీవు చేయువరకు నేను కాచుకొని యుందునా? అని చెప్పి మూడు బాణములు చేతపట్టుకొనిపోయి మస్తకివృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతో నున్న అబ్షాలోముయొక్క గుండెకు గురిపెట్టి 15తన ఆయుధములను మోయువారు పదిమంది చుట్టు చుట్టుకొని యుండగా అబ్షాలోమును కొట్టి చంపెను. 16అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీయులను తరుముకొనిపోయిన జనులు తిరిగి వచ్చిరి. 17జనులు అబ్షాలోముయొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్దగోతిలో పడవేసి పెద్దరాళ్లకుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులందరును తమతమ యిండ్లకు పోయిరి. 18తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షాలోము తాను బ్రదికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటివరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు.
19సాదోకు కుమారుడైన అహిమయస్సు–నేను పరుగెత్తి కొనిపోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా 20యోవాబు–ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక ఈ దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను. 21తరువాత కూషీని పిలిచి –నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయుమనగా కూషీ యోవాబునకు నమస్కారము చేసి పరుగెత్తికొని పోయెను. 22అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు–కూషీతోకూడ నేనును పరుగెత్తికొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబు–నాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారమేదియు లేదు గదా అని అతనితో అనగా 23అతడు–ఏమైనను సరే నేను పరుగెత్తికొని పోవుదుననెను. అందుకు యోవాబు –పొమ్మని సెలవియ్యగా అహిమయస్సు మైదానపు మార్గమున పరుగెత్తికొని కూషీకంటె ముందుగా చేరెను.
24దావీదు రెండు గుమ్మములమధ్యను నడవలో కూర్చొని యుండెను; కావలికాడు గుమ్మముపైనున్న గోడమీదికి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరుగెత్తికొని వచ్చుచున్న యొకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా 25రాజు–వాడు ఒంటరిగా ఉండినయెడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగుమీద వచ్చుచుండగా 26కావలికాడు పరుగెత్తికొని వచ్చు మరియొకని కనుగొని–అదిగో మరియొకడు ఒంటరి గానే పరుగెత్తికొని వచ్చుచున్నాడని ద్వారపుతట్టు తిరిగి చెప్పగా రాజు–వాడును వర్తమానము తెచ్చుచున్నా డనెను. 27కావలికాడు మొదటివాడు పరుగెత్తుట చూడగా –వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు–వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలో 28అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి–నా యేలినవాడవును రాజవునగు నిన్ను చంప చూచినవారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను. 29రాజు–బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడుగగా అహిమయస్సు–యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడనగునన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరు గుట నేను చూచితినిగాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను. 30అప్పుడు రాజు–నీవు ప్రక్కకు తొలగి నిలిచియుండుమని వాని కాజ్ఞనియ్యగా వాడు తొలగి నిలిచెను. 31అంతలో కూషీ వచ్చి–నా యేలిన వాడా రాజా, నేను నీకు శుభసమాచారము తెచ్చితిని; యీ దినమున యెహోవా నీ మీదికి వచ్చినవారినందరిని ఓడించి నీకు న్యాయము తీర్చెనని చెప్పినప్పుడు 32రాజు–బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగా–నా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చినవారందరును ఆ బాలుడున్నట్టుగానే యుందురు గాక. 33అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచు–నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.
Currently Selected:
2 సమూయేలు 18: TELUBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.