YouVersion 標誌
搜尋圖標

యోహాను 5

5
1అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను.
2యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు. 3-4ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. 5అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. 6యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి–స్వస్థపడ గోరుచున్నావా అని వానినడుగగా 7ఆ రోగి–అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. 8యేసు–నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా 9వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.
10ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు–ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి. 11అందుకు వాడు– నన్ను స్వస్థపరచినవాడు–నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను. 12వారు–నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి. 13ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను. 14అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి– ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా 15వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. 16ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. 17అయితే యేసు–నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. 18ఆయన విశ్రాంతిదినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.
19కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను– తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును. 20తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. 21తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును. 22తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని 23తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. 24నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 25మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడైయుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. 27మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను. 28దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలమువచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని 29మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.
30నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. 31నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము కాదు. 32నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును. 33మీరు యోహాను నొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. 34నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింప బడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను. 35అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్ట పడితిరి. 36అయితే యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 37మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు. 38ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు. 39లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు,#5:39 లేక, పరిశోధించుడి. అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 40అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు. 41నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను. 42నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు. 43నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీకరింతురు, 44అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి; 45మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును. 46అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు. 47మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను.

醒目顯示

分享

複製

None

想在你所有裝置上儲存你的醒目顯示?註冊帳戶或登入