YouVersion 標誌
搜尋圖標

యోహాను 4

4
1యోహాను కంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు 2ఆయన యూదయ దేశము విడిచి గలిలయదేశమునకు తిరిగి వెళ్లెను. 3అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి. 4ఆయన సమరయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక 5యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. 6అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాణమువలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు పండ్రెండు గంటలాయెను. 7సమరయ స్త్రీ ఒకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు–నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను. 8ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లియుండిరి. 9ఆ సమరయ స్ర్తీ–యూదుడ వైన నీవు సమరయ స్ర్తీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. 10అందుకు యేసు–నీవు దేవుని వరమును– నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజల మిచ్చునని ఆమెతో చెప్పెను. 11అప్పుడా స్ర్తీ–అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకు దొరకును? 12తానును తన కుమాళ్లును, పశువులును, యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? అని ఆయనను అడిగెను. 13అందుకు యేసు –ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; 14నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. 15ఆ స్త్రీ ఆయనను చూచి–అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదు కొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా 16యేసు నీవు వెళ్లి నీ పెనిమి టిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. 17ఆ స్ర్తీ–నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో– నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే; 18నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను. 19అప్పుడా స్ర్తీ–అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 20మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను 21–అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; 22మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది. 23అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు;#4:23 మూలభాషలోవెదకుచున్నాడు. 24దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. 25ఆ స్త్రీ ఆయనతో–క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా 26యేసు–నీతో మాటలాడుచున్ననేనే ఆయననని ఆమెతో చెప్పెను.
27ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్ర్తీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గానినీకేమికావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావని యైనను ఎవడును అడుగలేదు. 28ఆ స్త్రీ తనకుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి 29–మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా 30వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయనయొద్దకు వచ్చుచుండిరి. 31ఆ లోగా శిష్యులు–బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి. 32అందుకాయన–భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా 33శిష్యులు–ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పు కొనిరి. 34యేసు వారిని చూచి–నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది. 35ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలమువచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పు చున్నాను. 36విత్తువాడును కోయువాడును కూడ సంతోషించునట్లు, కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. 37విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే. 38మీరు దేనినిగూర్చి కష్టపడ లేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను.
39–నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్య మిచ్చిన స్ర్తీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమర యులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. 40ఆ సమరయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను. 41ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి–ఇకమీదట నీవు చెప్పిన మాటనుబట్టి కాక 42మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.
43ఆ రెండుదినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను. 44ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్య మిచ్చెను. 45గలిలయులు కూడ ఆ పండుగకు వెళ్లువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయనచేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.
46తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్న హూములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను. 47యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను. 48యేసు–సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను. 49అందుకా ప్రధాని–ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. 50యేసు–నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను. 51అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి. 52ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారు–నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. 53–నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి. 54ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.

醒目顯示

分享

複製

None

想在你所有裝置上儲存你的醒目顯示?註冊帳戶或登入