YouVersion 標誌
搜尋圖標

ఆదికాండము 18

18
1మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 2అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి 3–ప్రభువా, నీ కటాక్షము నామీద నున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. 4నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. 5కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసునియొద్దకు వచ్చితిరనెను. వారు–నీవు చెప్పినట్లు చేయుమనగా 6అబ్రాహాము గుడారములోనున్న శారాయొద్దకు త్వరగా వెళ్లి–నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. 7మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్ప గించెను.వాడు దాని త్వరగా సిద్ధపరచెను. 8తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనముచేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను. 9వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు–అదిగో గుడారములోనున్నదని చెప్పెను. 10అందుకాయన–మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు విను చుండెను. 11అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక 12శారా–నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడుగదా అని తనలో నవ్వు కొనెను. 13అంతట యెహోవా అబ్రాహాముతో–వృద్ధు రాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల? 14యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. 15శారా భయపడి–నేను నవ్వలేదని చెప్పగా ఆయన–అవును నీవు నవ్వితివనెను.
16అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమతట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను. 17అప్పుడు యెహోవా–నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? 18అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును. 19ఎట్లనగా యెహోవా అబ్రాహామునుగూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.
20మరియు యెహోవా–సొదొమ గొమొఱ్ఱాలనుగూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను 21నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను. 22ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను. 23అప్పుడు అబ్రాహాము సమీపించి యిట్లనెను–దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా? 24ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతులనిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? 25ఆ చొప్పున చేసి దుష్టులతోకూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు 26యెహోవా–సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను 27అందుకు అబ్రాహాము–ఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 28ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన–అక్కడ నలుబదియైదు గురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను; 29అతడింక ఆయనతో మాటలాడుచు–ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా 30అతడు–ప్రభువు కోపపడనియెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను. 31అందుకతడు–ఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన –ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా 32అతడు–ప్రభువు కోపపడనియెడల నే నింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను. 33యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.

醒目顯示

分享

複製

None

想在你所有裝置上儲存你的醒目顯示?註冊帳戶或登入