YouVersion 標誌
搜尋圖標

ఆదికాండము 17

17
1అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. 2నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. 3-4అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి–ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు. 5మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రి నిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును. 6నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు. 7నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను. 8నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను. 9మరియు దేవుడు–నీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. 10నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా–మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. 11మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 12ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. 13నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. 14సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టివేయబడును.వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను.
15మరియు దేవుడు–నీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా#17:15 రాజకుమారి. 16నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగ జేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను. 17అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి–నూరేండ్లవానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను. 18అబ్రాహాము–ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా 19దేవుడు–నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. 20ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండుమంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను; 21అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను. 22దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను. 23అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగచర్మమున సున్నతి చేసెను. 24అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంబది తొమ్మిది యేండ్లవాడు. 25అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగచర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదుమూడేండ్లవాడు. 26ఒక్కదినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. 27అతని యింట పుట్టినవారును అన్యునియొద్ద వెండితో కొనబడినవారును అతని యింటిలోని పురుషులందరును అతనితోకూడ సున్నతి పొందిరి.

醒目顯示

分享

複製

None

想在你所有裝置上儲存你的醒目顯示?註冊帳戶或登入