యోహాను 9

9
పుట్టు గుడ్డి వాడు చూపు పొందడం
1ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండీ గుడ్డివాడుగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. 2ఆయన శిష్యులు, “బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా, లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా?” అని ఆయనను అడిగారు. 3అందుకు యేసు, “వీడైనా, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డివాడుగా పుట్టాడు. 4పగలున్నంత వరకూ నన్ను పంపిన వాడి పనులు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తుంది. అప్పుడిక ఎవరూ పని చేయలేరు. 5ఈ లోకంలో ఉన్నంతవరకూ నేను ఈ లోకానికి వెలుగుని” అని చెప్పాడు.
6ఆయన ఇలా చెప్పి, నేలపై ఉమ్మి వేసి, దానితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డివాడి కన్నులపై పూశాడు. 7“సిలోయం కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కో” అని వాడికి చెప్పాడు. సిలోయం అనే మాటకు ‘వేరొకరు పంపినవాడు’ అని అర్థం. వాడు వెళ్ళి ఆ కోనేటిలో కడుక్కుని చూపు పొంది తిరిగి వచ్చాడు. 8అప్పుడు ఇరుగు పొరుగు వారూ, ఇంతకు ముందు వాడు అడుక్కుంటుంటే చూసిన వారూ, “ఇక్కడ కూర్చుని అడుక్కునే వాడు ఇతడే కదా!” అన్నారు. 9“వీడే” అని కొందరూ, “వీడు కాదు” అని కొందరూ అన్నారు. ఇక వాడైతే, “అది నేనే” అన్నాడు.
10వారు, “నీ కళ్ళు ఎలా తెరుచుకున్నాయి?” అని వాణ్ణి అడిగారు. 11దానికి వాడు, “యేసు అనే ఒకాయన బురద చేసి నా కళ్లపై పూసి సిలోయం కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాకు చెప్పాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అన్నాడు. 12వారు, “ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?” అని అడిగితే వాడు, “నాకు తెలియదు” అన్నాడు. 13ఇంతకు ముందు గుడ్డి వాడుగా ఉన్న ఆ మనిషిని వారు పరిసయ్యుల దగ్గరికి తీసుకు వెళ్ళారు. 14యేసు బురద చేసి వాడి కళ్ళు తెరచిన రోజు విశ్రాంతిదినం.
15వాడు చూపు ఎలా పొందాడో చెప్పమని పరిసయ్యులు కూడా వాడినడిగారు. వాడు, “ఆయన నా కన్నులపై బురద పూశాడు. నేను వెళ్ళి కడుక్కుని చూపు పొందాను” అని వారికి చెప్పాడు.
16“ఈ వ్యక్తి విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు కాబట్టి ఇతడు దేవుని దగ్గర నుండి రాలేదు” అని పరిసయ్యుల్లో కొందరు అన్నారు. మరి కొందరు, “ఇతడు పాపి అయితే ఇలాటి అద్భుతాలు ఎలా చేయగలడు?” అన్నారు. ఈ విధంగా వారిలో భేదాభిప్రాయం కలిగింది. 17దాంతో వారు గుడ్డివాడుగా ఉన్నవాడితో, “నీ కళ్ళు తెరిచాడు కదా! ఆయన గురించి నీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగారు. అప్పుడు వాడు, “ఆయన ఒక ప్రవక్త” అన్నాడు.
18వాడు గుడ్డివాడుగా ఉండి చూపు పొందాడని యూదులు మొదట నమ్మలేదు. అందుకని వాడి తల్లిదండ్రులను పిలిపించారు. 19“గుడ్డివాడుగా పుట్టాడని మీరు చెప్పే మీ కొడుకు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలా చూడగలుగుతున్నాడు?” అని వారిని అడిగారు. 20దానికి వాడి తల్లిదండ్రులు, “వీడు మా కొడుకే. వీడు గుడ్డివాడిగానే పుట్టాడు. 21అయితే ఇప్పుడు వీడు ఎలా చూస్తున్నాడో మాకు తెలీదు. వీడి కళ్ళు తెరిచినదెవరో మాకు తెలీదు. అయినా వీడికి వయస్సు వచ్చింది. వీడినే అడగండి. తన సంగతి వీడే చెప్పుకోగలడు” అన్నారు.
22వాడి తల్లిదండ్రులు యూదులకు భయపడి ఆ విధంగా చెప్పారు. ఎందుకంటే యూదులు అప్పటికే ఎవరైనా ఆయనను క్రీస్తు అని ఒప్పుకుంటే వారిని తమ సమాజ మందిరాల్లో నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. 23కాబట్టే వాడి తల్లిదండ్రులు ‘వాడు వయస్సు వచ్చినవాడు, వాడినే అడగండి’ అన్నారు. 24కాబట్టి వారు అప్పటివరకూ గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని రెండవ సారి పిలిపించారు. “దేవునికి మహిమ చెల్లించు. ఈ మనిషి పాపాత్ముడు అని మాకు తెలుసు” అని అతనితో అన్నారు. 25అందుకు వాడు, “ఆయన పాపాత్ముడో కాదో నాకేం తెలుసు? అయితే నాకు ఒక్కటి తెలుసు. నేను గుడ్డివాడుగా ఉండేవాణ్ణి, ఇప్పుడైతే చూస్తున్నాను” అన్నాడు.
26దానికి వారు, “అసలు ఆయన నీకేం చేశాడు? నీ కళ్ళు ఎలా తెరిచాడు?” అని మళ్ళీ అడిగారు. 27దానికి వాడు, “ఇంతకు ముందే మీకు చెప్పాను. మీరు వినలేదు. మళ్ళీ ఎందుకు వినాలనుకుంటున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా ఏంటి?” అని వారితో అన్నాడు.
28అందుకు వారు “నువ్వే వాడి శిష్యుడివి. మేము మోషే శిష్యులం. 29దేవుడు మోషేతో మాట్లాడాడని తెలుసు కానీ ఈ మనిషి విషయమైతే అసలు ఇతడు ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలియదు” అంటూ వాణ్ణి బాగా దూషించారు. 30అయితే వాడు, “ఆయన ఎక్కడి నుండి వచ్చాడో కూడా మీకు తెలియక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనా ఆయన నా కళ్ళు తెరిచాడు. 31దేవుడు పాపుల ప్రార్థనలు వినడని మనకు తెలుసు. అయితే దేవునిలో భక్తి కలిగి ఆయన ఇష్టాన్ని జరిగిస్తే అతని ప్రార్థనలు ఆయన వింటాడు. 32గుడ్డివాడిగా పుట్టిన వ్యక్తి కళ్ళు ఎవరైనా తెరిచినట్టు లోకం మొదలైనప్పటి నుండి ఎవరూ వినలేదు. 33ఈయన దేవుని దగ్గర నుండి రాకపోతే ఇలాంటివి చేయలేడు” అని చెప్పాడు. 34దానికి వారు, “పాపిగా పుట్టిన వాడివి, నువ్వు మాకు బోధిస్తున్నావా?” అని చెప్పి వాణ్ణి తమ సమాజ మందిరం నుండి బహిష్కరించారు.
35పరిసయ్యులు వాణ్ణి బహిష్కరించారని యేసు విన్నాడు. ఆయన వాణ్ణి కలుసుకుని, “నువ్వు దేవుని కుమారుడిలో విశ్వాసముంచుతున్నావా?” అని వాణ్ణి అడిగాడు. 36అందుకు వాడు, “ప్రభూ, అలా విశ్వాసముంచడానికి ఆయన ఎవరో నాకు తెలియదే” అన్నాడు. 37యేసు, “ఇప్పుడు నువ్వు ఆయనను చూస్తున్నావు. నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని” అన్నాడు. 38అప్పుడు వాడు, “నేను నమ్ముతున్నాను ప్రభూ” అంటూ ఆయనను ఆరాధించాడు.
39అప్పుడు యేసు, “‘చూడనివారు చూడాలి. చూసేవారు గుడ్డివారు కావాలి’ అనే తీర్పు జరగడం కోసం నేను ఈ లోకంలోకి వచ్చాను” అన్నాడు. 40ఆయనకు దగ్గరలో ఉన్న పరిసయ్యుల్లో కొంత మంది ఆ మాట విని, “అయితే మేము కూడా గుడ్డివాళ్ళమేనా?” అని అడిగారు. 41అందుకు యేసు, “మీరు గుడ్డివారైతే మీకు పాపం ఉండేది కాదు. కానీ ‘మాకు చూపు ఉంది’ అని మీరు చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది” అని చెప్పాడు.

Àwon tá yàn lọ́wọ́lọ́wọ́ báyìí:

యోహాను 9: IRVTel

Ìsàmì-sí

Pín

Daako

None

Ṣé o fẹ́ fi àwọn ohun pàtàkì pamọ́ sórí gbogbo àwọn ẹ̀rọ rẹ? Wọlé pẹ̀lú àkántì tuntun tàbí wọlé pẹ̀lú àkántì tí tẹ́lẹ̀

Àwọn fídíò fún యోహాను 9