రోమా 7:17-25
రోమా 7:17-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. నాకున్న పాప స్వభావాన్ని బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కనుక, నేను మంచిని జరిగించాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను నెరవేర్చలేకపోతున్నాను. నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, నేను దేనినైతే చేయకూడదు అని అనుకుంటున్నానో ఆ చెడునే చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. కనుక ఈ నియమాన్ని నేను గమనించాను, నేను మంచిని చేయాలని అనుకుంటున్నప్పటికి నాలో చెడు ఉన్నది. నా అంతరంగంలో దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది, అది నా మనస్సులోని నియమంతో పోరాడుతున్నది, నాలో పని చేస్తున్న పాపనియమానికి అది నన్ను బంధీగా చేస్తుంది. నేను ఎంత దౌర్భాగ్యుడిని! మరణానికి బంధీగా ఉన్న నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నాకు విడుదలను ఇచ్చే దేవునికి వందనాలు! అయితే నా మనస్సులో నేను దేవుని ధర్మశాస్త్రానికి దాసుడను, కాని నాకున్న పాప స్వభావంలో నేను పాపనియమానికి దాసుడను.
రోమా 7:17-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి దాన్ని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు. నాలో, అంటే నా శరీరంలో మంచిదేదీ లేదని నాకు తెలుసు. మంచిని చేయాలనే కోరిక నాకు కలుగుతుంది గాని, దాన్ని చేయడం నా వల్ల కావడం లేదు. నేను చేయాలని కోరే మంచిని చేయకుండా, నేను చేయగోరని చెడును జరిగిస్తున్నాను. నేను కోరని దాన్ని చేస్తే అది నాలోని పాపమే గాని నేను కాదు. అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాలోనే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. కానీ వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసులోని ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాల్లోని పాప నియమానికి నన్ను బందీగా చేస్తున్నది. అయ్యో, నేనెంత నికృష్టుణ్ణి? చావుకు లోనైన ఈ శరీరం నుండి నన్నెవరు విడిపిస్తారు? మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెబుతున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవనియమానికీ, శరీర విషయంలో పాప నియమానికీ దాసుణ్ణి.
రోమా 7:17-25 పవిత్ర బైబిల్ (TERV)
నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను. చెయ్యాలనుకొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడును నేను చేస్తూ పోతున్నాను. చెయ్యకూడదనుకొన్నదాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది. అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది. కాని, నా అవయవాల్లో వేరొక నియమం పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నన్ను పాపాత్మునిగా చేస్తున్న ఈ నియమం నా మెదడులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను ఖైదీగా చేస్తోంది. నేనంత దౌర్భాగ్యుణ్ణి! మరణం యొక్క ఆధీనంలో ఉన్న ఈ నా శరీరంనుండి నన్ను ఎవరు రక్షిస్తారు? అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొందాం. స్వయంగా, బుద్ధి పూర్వకంగా నేను దేవుని ధర్మశాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే నియమానికి బానిస.
రోమా 7:17-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కావున ఇకను దానిచేయు నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.
రోమా 7:17-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. నాకున్న పాప స్వభావాన్ని బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కాబట్టి, మంచి చేయాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను చేయలేకపోతున్నాను. నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, చేయకూడదని అనుకుంటున్న చెడునే నేను చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. కాబట్టి నేను మంచి చేయాలని అనుకుంటున్నప్పటికి నాలో చెడు ఉందనే నియమాన్ని నేను గమనించాను. నా అంతరంగాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది. అది నా మనస్సులోని నియమంతో పోరాడుతూ నాలో పని చేస్తున్న పాపనియమానికి నన్ను బందీగా చేస్తుంది. నేను ఎంత దౌర్భాగ్యుడిని! మరణానికి బందీగా ఉన్న నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నాకు విడుదలను ఇచ్చే దేవునికి వందనాలు! అయితే నా మనస్సులో నేను దేవుని ధర్మశాస్త్రానికి దాసుడను, కాని నాకున్న పాప స్వభావంలో నేను పాపనియమానికి దాసుడను.