రోమా 7

7
1సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను. 2భర్తగల స్త్రీ, భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలుగాని, భర్త చనిపోయినయెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదల పొందును. 3కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని#7:3 అసలుమాట–వివాహము చేసికొనినయెడల. చేరినయెడల వ్యభిచారిణియనబడును గాని, భర్త చనిపోయినయెడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును. 4కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. 5ఏలయనగా మనము శరీరసంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై యుండెను. 6ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొంది తిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము.
7కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. 8అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని#7:8 లేక, ఆజ్ఞద్వారా. సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 9ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని. 10అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. 11ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువుచేసికొని#7:11 లేక, ఆజ్ఞద్వారా. నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. 12కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది. 13ఉత్తమమైనది నాకు మరణకర మాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, అది నాకు మరణకరమాయెను. 14ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినై యున్నాను. 15ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. 16ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. 17కావున ఇకను దానిచేయు నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. 18నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. 19నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను. 20నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. 21కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. 22అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని 23వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది. 24అయ్యో, నేనెంత దౌర్భాగ్యు డను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? 25మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

రోమా 7: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in